కుంభమేళాకు మోడీ : గంగకు ప్రణమిల్లి భక్తిని చాటుకుని !

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీష్మాష్టమి మాఘమాసం శుభఘడియలలో మహా కుంభమేళా కి వచ్చారు.

Update: 2025-02-05 07:30 GMT

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీష్మాష్టమి మాఘమాసం శుభఘడియలలో మహా కుంభమేళా కి వచ్చారు. ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించారు. గంగకు ప్రణమిల్లారు, భక్తిని చాటుకుంటూ తనదైన ఆధ్యాత్మికతలో పరవశించారు.

ఢిల్లీ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా ప్రయాగ్ రాజ్ కి చేరుకున్న ప్రధాని పుణ్య స్నానాలు ఆచరించడానికి అరైల్ ఘాటు వద్దకు చేరుకున్నారు. అక్కడ గంగా యమున సరస్వతి మూడు నదుల ముచ్చటైన సంగమం వద్ద పుణ్య స్నానాలు చేశారు.

ప్రయాగ్ రాజ్ ఒడ్డు నుంచి త్రివేణీ సంగమం దాకా ఆయన బోటులో ప్రయాణించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ బోటులో సంభాషించుకున్న విజువల్స్ అందరికీ ఆసక్తికరంగానూ ఆకట్టుకునే విధంగానూ ఉన్నాయి. బోటులో ప్రయాణిస్తూనే మోడీ ఘాట్ల వద్ద స్నానాలు చేస్తున భక్తులకు చేతులు ఊపి పలకరించారు.

మహా కుంభమేళా జనవరి 13 నుంచి మొదలైంది. ఈ నెల 26 దాకా కొనసాగుతుంది. సరిగ్గా మరో ఇరవై రోజులలో మహా కుంభమేళా ముగుస్తుంది అనగా బుధవారం మోడీ కుంభమేళాకు రావడం విశేషం. ప్రయాగ్ రాజ్ లో మోడీ మొత్తంగా గంటన్నర సేపు ఉన్నారు. ఆయన ఈ సందర్భంగా సాధువులతో భక్తులతోనూ సంభాషిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

మహా కుంభమేళాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెల చివరిలో వచ్చారు. ఆయన కూడా మఠాధిపతులు సాధువులతో సమావేశం జరిపారు. ఇక చూస్తే కనుక మంగళవారం దాకా కుంభమేళాకు తరలివచ్చిన దేశ విదేశీ భక్తుల సంఖ్య 38 కోట్లని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరో ఇరవై రోజులు ఉన్నందువల్ల ఈసారి అరవై కోట్ల మంది దాకా భక్తులు కుంభమేళాకు తరలి రావచ్చు అని ఒక అంచనా వేస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక జాతరగా కుంభమేళా ఉంది. మహా కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మతపరమైన సమావేశంగా చూడాలి. కానీ ప్రతి 144 సంవత్సరాలకు ఒక ప్రత్యేక మహా కుంభమేళా నిర్వహించబడుతుంది. ఈసారి అలా ఈ ప్రత్యేక మహా కుంభమేళా వచ్చిందని చెబుతున్నారు. ఈ తరానికి ఇదే చివరి ప్రత్యేక మహా కుంభమేళాగా పేర్కొంటారు. అందుకే పెద్ద ఎత్తున కోట్లాది మంది భక్తులు కుంభమేళకు విశేషంగా తరలివస్తున్నారు.

Tags:    

Similar News