కాపాడుకోవడం.. కుద‌రినా.. జ‌గ‌న్‌కు అగ్నిప‌రీక్షే...!

నాయ‌కులు ఒక్కొక్క‌రు కాదు.. గుంపుగానే ఇప్పుడు చిక్కుల్లో ప‌డుతున్నారు.

Update: 2024-09-17 10:10 GMT

నాయ‌కులు ఒక్కొక్క‌రు కాదు.. గుంపుగానే ఇప్పుడు చిక్కుల్లో ప‌డుతున్నారు. అది కూడా.. ఫైర్‌బ్రాండ్లుగా పార్టీకి అండ‌గా ఉన్న నాయ‌కుల‌ను ఇప్పుడు కూట‌మి స‌ర్కారు టార్గెట్ చేస్తోంది. గ‌తాన్ని మ‌రిచిపోని కొంద‌రు త‌మ్ముళ్లు చంద్ర‌బాబు చెవిలో జోరీగ‌లుగా మారిపోయారు. దీంతో వారిని సంతృప్తి ప‌రిచేందుకు అయినా.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న సంకేతాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు వైసీపీ నాయ‌కుల‌కు చిక్కులు ప్రారంభ‌మ‌య్యాయి.

ప్ర‌ధానంగా గ‌తంలో వైసీపీ ఏవిధంగా అయితే గ‌నుల లీజు పొందిన వారిని టార్గెట్ చేసుకుని వేధించిందో .. ఇప్పుడు అదేవిధంగా కూట‌మి స‌ర్కారు కూడా గ‌నుల లీజులు, ఇసుక త‌వ్వ‌కాలు వంటివాటిని టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో సీమ‌లోని అనేక మంది నాయ‌కులు అల్లాడిపోతున్నారు. ముఖ్య‌మైన ఆదాయ వ‌న‌రుగాఉన్న గ‌నుల లీజుల‌పైనే దెబ్బ ప‌డితే.. త‌మ ప‌రిస్థితి దారుణంగా మారు తుంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా స‌త్య‌సాయి జిల్లా క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ సీనియ‌ర్‌నాయ‌కుడు, పార్టీకి ఫండింగ్ చేసే ర‌మే ష్ రెడ్డి గ‌నుల కేసులో చిక్కుకున్నారు. ఆయ‌న నిర్వ‌హిస్తున్న గ‌నుల లీజును ర‌ద్దు చేసేందుకు స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు లీజుకు తీసుకున్న స్థ‌లం కంటే ఎక్కువ‌గా త‌వ్వ‌కాలు జ‌రిపారంటూ.. ఆయ‌న పై గ‌నుల శాఖ కేసు న‌మోదు చేసి.. 13 కోట్ల రూపాయ‌ల జ‌రిమానా విధించింది. ఈ ప‌రిణామంతో జిల్లాలో వైసీపీ నాయ‌కులు ఉలిక్కిప‌డ్డారు.

మెజారిటీ నాయ‌కులు సీమ‌లో గ‌నుల వ్యాపారంలోనే ఉన్నారు. ఇప్పుడు వారంతా త‌మ ప‌రిస్థితి ఏంట‌ని వాపోతున్నారు. ఇలాంటి వారిని కాపాడాల్సిన అవ‌స‌రం అధినేత‌కు ఉంద‌నేది మ‌రికొంద‌రు చెబుతున్న మాట‌. క్షేత్ర‌స్థాయిలో ఫండింగ్ చేసే నాయ‌కుల ఆర్థిక మూలాలు దెబ్బ‌తింటే.. అది అంతిమంగా పార్టీపై దెబ్బ ప‌డేలా చేస్తుంద‌ని చెబుతున్నారు. ఇక‌, చీమ‌కుర్తి, ప్ర‌కాశంజిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ఇసుక లీజులు పొందిన వారికి కూడా ఉచ్చు బిగిస్తోంది. వీరిని ఇప్పుడు కాపాడుకోక‌పోతే.. జ‌గ‌న్‌కు మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌ద‌న్న సంకేతాలు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News