ముఖ్యమంత్రి గారూ... ఏంటా ఫ్రస్ట్రేషన్.. ఏంటా మాటలు...!
ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. రేవంత్‌కు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి పదవి అంటేనే రాజ్యాంగబద్ధమైన హోదా. ఉన్నతమైన పదవి. హూందాగా ఉంటూ ప్రజలకు మేలు చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. అటు.. ప్రతిపక్షాలతోనూ కాస్త హూందాగా నడుచుకోవాల్సిన ఎంతైనా ఉందంటారు. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ‘ఒక సీఎం హోదాలో ఉండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు..’ అంటూ క్షేత్రస్థాయిలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
‘తొక్కిస్తా.. నార తీస్తా.. కుక్క చావే.. ఎవడస్తాడో రండి.. ఎవడు అడ్డొచ్చినా ఏది ఆగదు..’ ఇవీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ నోట వింటున్న మాటలు. అయితే.. ఈ మాటలతో ప్రతిపక్షాలేమో కానీ.. ప్రజలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. రేవంత్‌కు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది. ఆ తరువాత ప్రజలు ఆదరిస్తే వారికి అధికారం చేజిక్కుతుంది. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉండిపోయింది. 11 నెలలుగా అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరినప్పటి నుంచి ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఇప్పుడు ఉన్నత హోదా, రాష్ట్రానికి బాస్‌లా ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ నిపుణులు సైతం వ్యతిరేకిస్తున్నారు.
రేవంత్ అంటేనే ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. జడ్పీటీసీ స్థాయి నుంచి ఆయన ఈ రోజు సీఎం స్థాయి వరకూ వచ్చారు. ప్రజల్లో ఆయన అంటే అంతటి అభిమానం సైతం ఉంది. అయితే.. అంత మంచి అభిమానాన్ని ప్రతిపక్షాలపై చేస్తున్న కామెంట్స్ దెబ్బతీస్తున్నాయి. ఎన్నో ఉన్నత లక్ష్యాలతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్.. ఈ మాటలతో తక్కువ కావద్దని ప్రజల్లోనూ అభిప్రాయం వినిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా పార్టీలు తమ బాధ్యతను ఎలాగూ నిర్వర్తించాల్సిందే. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుపడడం కామన్. ప్రతిదాంట్లోనూ లోపాలు వెతికే పనిలోనే ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సైతం అదే చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా, మూసీ, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలపై నిత్యం నిలదీస్తున్నాయి. రుణమాఫీ విషయంలోనూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.
అయితే.. వారి ఆరోపణలకు, వారి వ్యాఖ్యలకు హూందాగా సమాధానం ఇవ్వాల్సింది పోయి రేవంత్ కాస్త ఫైర్ మీద వెళ్తున్నారని టాక్ నడుస్తోంది. ఏకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలోనూ హైడ్రాకు ప్రతిపక్షాలు అడ్డుపడిన సందర్భంలోనూ వారిపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పలువురు నేతలను టార్గె్ట్ చేస్తూ వారిపై ఇష్టారీతిన మాట్లాడారు. బుల్డోజర్లతో తొక్కిస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కాస్త హూందాగా నడుచుకోవాలని సూచిస్తున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్.. ప్రతిపక్షాల విషయంలోనూ హోదాకు తగినట్లుగా విమర్శలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.