కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. కొత్త మంత్రులు ఎవరంటే..?

తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దసరా నాటికే విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది.

Update: 2024-10-01 04:43 GMT

తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దసరా నాటికే విస్తరణ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. దాంతో ఆశావహుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. మరోసారి అధిష్టానం వద్దకు పరుగులు పెడుతున్నారు. మంత్రి పదవి కోసం పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరో ఆరు బెర్త్‌లను భర్తీ చేసే అవకాశం ఉండడంతో ఎవరికి అవకాశం లభిస్తుందా..? అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

దశాబ్ద కాలం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. పదవీ స్వీకారం సమయంలో రేవంత్‌తో మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తంగా 12 మంది కొలువుదీరారు. మరో ఆరు బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఒకేసారి భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే.. గత నెల రెండు నెలల క్రితమే కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. అందుకే.. కేబినెట్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇన్ని నెలలు అవుతున్నా పూర్తిస్థాయి కేబినెట్ లేకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. దాంతో వాటన్నింటినీ తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ అధిష్టానం వద్దకు వెళ్లి తొరగా క్యాండిడేట్లను ఫైనల్ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

ఇన్ని రోజులు పీసీసీ చీఫ్ నియామకం కోసం ఎదురుచూడగా.. ఎట్టకేలకు చీఫ్ నియామకం కూడా పూర్తయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ విస్తరణ మీదనే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ టూర్‌లో ఉన్నారు. ఈ వీకెండ్‌లో ఆయన ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. ఆయన వచ్చాక సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణపై రాహుల్‌తో చర్చిస్తారని సమాచారం. ఆశావహుల సంఖ్య పెరుగుతుండడంతో ఎవరిని ఫైనల్ చేయాలనే అంశం కూడా అధిష్టానానికి టాస్క్‌లా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కేబినెట్ లో అవకాశం లేదని ఇప్పటికే రేవంత్ తేల్చిచెప్పారు. దాంతో వారిలో ఆశలు సన్నగిల్లాయి. ఇక.. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వారిలోనే పోటాపోటీ కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌తో భేటీ తరువాతనే మంత్రివర్గ విస్తరణపై ఓ క్లారిటీ రానుంది. అయితే.. సామాజిక వర్గాల వారీగా అందరినీ న్యాయం చేసేలా రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అధిష్టానానికి జాబితా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కేబినెట్‌లో ఎవరికీ చోటు లభించలేదు. అయితే.. ఆ జిల్లాల నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండడంతో ఎవరికి చోటు దక్కుతుందో కూడా తెలియదు. ఇదిలా ఉండగా.. కొందరు ఆశావహుల జాబితా చక్కర్లు కొడుతోంది. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, బాలూనాయక్, రామచంద్రునాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, దానం నాగేందర్, వాకిటి శ్రీహరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆయనకు బెర్త్‌లో స్థానం లభించకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.

Tags:    

Similar News