టీడీపీలో భారీ ప్రక్షాళన.. లోకేష్ కోసం సీనియర్లు అవుట్..!
ఈ అంశం మీదే ఈసారి పార్టీలో ప్రక్షాళన కార్యక్రమం ఉండబోతుందట. ఇందుకోసం పార్టీలో కొన్ని కొత్త రూల్స్ కూడా పెట్టుకోబోతున్నారు.
తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయా ? అంటే తాజాగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పార్టీ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా సీరియస్ గా పక్కా ప్రణాళికతో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికలలో గెలిచాక గతంలో ఎప్పుడూ లేని విధంగా కేడర్లో పెరుగుతున్న అసంతృప్తిని పరిగణలోకి తీసుకోవడంతో పాటు అందరికీ అవకాశాలు ... అందులోనూ పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు ఇవ్వాలి అన్న పాయింట్ బేస్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఈ అంశం మీదే ఈసారి పార్టీలో ప్రక్షాళన కార్యక్రమం ఉండబోతుందట. ఇందుకోసం పార్టీలో కొన్ని కొత్త రూల్స్ కూడా పెట్టుకోబోతున్నారు.
ఈ రూల్స్ అన్ని గ్రామస్థాయి నుంచి పొలిటి బ్యూరో వరకు అందరికీ వర్తిస్తాయని అవి అమలులోకి వస్తే ఈసారి పార్టీ ముఖచిత్రమే మారిపోతుందని చెప్పుకుంటున్నాయి టిడిపి వర్గాలు. అలాగే తొలిసారి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కూడా రాబోతుందట. ప్రస్తుతం గ్రామ, మండల స్థాయిలో పదవులు భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో పదవులు భర్తీచేస్తారు. గ్రామస్థాయి నుంచే కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలుస్తోంది. కొత్త నిబంధనలు ప్రకారం ఒక నాయకుడికి పార్టీ పదవి ఒకటే ఉంటుంది.. అది కూడా రెండు సంవత్సరాలు మాత్రమే.. అలా ఎందుకని అంటే అందరికీ అవకాశాలు సమానంగా రావాలి అన్నదే పార్టీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.
ఏళ్ల తరబడి ... దశాబ్దాలు తరబడి కూడా పార్టీ పదవులు నిర్వహిస్తున్న నాయకులు పార్టీలో చాలామంది ఉన్నారు. టిడిపి అధికారంలో ఉన్న లేకపోయినా వాళ్లు మాత్రం ఆ పదవులలో అలాగే కొనసాగుతూ ఉండటంపై తర్వాతి తరం నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. జీవితకాలం వాళ్లే పదవుల్లో ఉంటే తర్వాత తరం యువకుల సంగతి ఏంటి ? మేము ఇలాగే రిటైర్ అయిపోవాలా ? అన్న అసంతృప్తులు కూడా పార్టీలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాంటి వారికి చెప్పి అందరికీ ఛాన్సులు దక్కేలా ఈసారి అధిష్టానం ఆలోచన చేస్తోంది.
మరి ముఖ్యంగా లోకేష్ త్వరలోనే నాయకత్వంలోకి రానుండడంతో... లోకేష్ భవిష్యత్తు కోసం ద్వితీయ శ్రేణిలో అసంతృప్తి.. అసహనం పెరగకుండా ఉండాలంటే ఈ మార్పు తప్పనిసరి అని చంద్రబాబు - లోకేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అటు పార్టీ అత్యున్నత విభాగం అయిన పొలిటి బ్యూరోలో కూడా మార్పులపై గట్టి చర్చే జరుగుతుందట. సీనియర్లు .. సూపర్ సీనియర్లు ఏళ్ల తరబడి ఆ పోస్టుల్లో తిష్ట వేసి ఉంటున్నారు. ఆ స్థానాల్లో యువ నాయకులకు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నట్టు సమాచారం.