జనవరి 1 స్పెషల్.. మేడ్చల్.. శామీర్ పేటకు మెట్రో
రెండో దశలో భాగంగా మేడ్చల్.. శామీర్ పేట వరకు మెట్రో రైలు కారిడార్లను విస్తరించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.
హైదరాబాద్ మహానగరాన్ని వెంటాడి వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. ఈ విషయంలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో నగర మెట్రో విస్తరణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం తెలిసిందే. మారుతున్న కాలానికి తగ్గట్లు.. మెట్రో విస్తరణ చేపడుతున్న మహానగరాలకు భిన్నంగా హైదరాబాద్ మహానగరంలో తొలుత చేపట్టిన మెట్రో మినహా మరెలాంటి కొత్త రూట్లను నిర్మించకపోవటం తెలిసిందే.
అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహానగరంలో మెట్రో విస్తరణపై చకచకా నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. తన ప్రభుత్వ పదవీకాలం పూర్తి అయ్యే నాటికి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్ పోర్టు మెట్రోతో పాటు.. మరికొన్ని రూట్లను క్లియర్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించిన అనుమతుల కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. కొత్త సంవత్సర వేళ హైదరాబాద్ మహానగరంలోని ఉత్తర భాగానికి చెందిన ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు తీపి కబురు చెప్పింది.
రెండో దశలో భాగంగా మేడ్చల్.. శామీర్ పేట వరకు మెట్రో రైలు కారిడార్లను విస్తరించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ లను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందులో బాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాల్ని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మూడు నెలల వ్యవధిలో ఈ డీపీఆర్ లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని.. దీన్ని మెట్రో రైలు ఫేజ్ 2 ‘బీ’లో చేర్చినట్లుగా వెల్లడించారు.
మెట్రో రెండో దశలోని ‘ఏ’ భాగంలో ఐదు మార్గాలను చేర్చటం తెలిసిందే. ఇప్పుడు ఓకే చేసిన రెండు రూట్లను ‘బీ’ భాగంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఏ భాగానికి చెందిన ఐదు రూట్లకు సంబంధించిన డీపీఆర్ లను కేంద్ర అనుమతి కోసం పంపటం తెలిసిందే. రెండో ఫేజ్ లో ‘బి’ భాగంంలో శంసాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో విస్తరించారలన్న ప్రతిపాదనలకు సంబంధించి డీపీఆర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
కొత్తగా తెర మీదకు వచ్చిన రెండు రూట్లలో మొదటిది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి..
తాడ్ బండ్
బోయిన్ పల్లి
సుచిత్ర సర్కిల్
కొంపల్లి
గుండ్లపోచంపల్లి
కండ్లకోయ
ఓఆర్ఆర్ ఎగ్జిట్
మేడ్చల్
ఈ రూట్లలో దాదాపు 23 కిలోమీటర్ల మేర కారిడార్ ను పొడిగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో శామీర్ పేట రూట్ విషయంలోనూ ప్రాథమిక అవగాహనకు వచ్చిన ప్భుత్వం.. ఆ వివరాల్ని వెల్లడించారు. ఇందులో జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి.
విక్రంపురి
కార్ఖానా
తిరుమలగిరి
లోతుకుంట
అల్వాల్
బొల్లారం
హకీంపేట
తూంకుంట
ఓఆర్ఆర్ ఎగ్జిట్
శామీర్ పేట వరకు 22 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ను విస్తరించాలని డిసైడ్ చేశారు. గతంలో తాను మల్కాజిగిరి ఎంపీగా వ్యవహరించిన సమయంలో తనకు అక్కడి ట్రాపిక్ సమస్యలు. కారిడార్ మార్గాలపై అవగాహన ఉందన్న సీఎం రేవంత్.. తాజా విస్తరణ అంశాల్ని స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ కు వివరించి.. ఆయన సలహాలు.. సూచనలు తీసుకోవాలని కోరారు.
ఈ రెండు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ లను మూడు నెలల్లో పూర్తి చేయాలిన సీఎం సూచన చేసినట్లుగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. డీపీఆర్ తయారీ అనంతరం క్యాబినెట్ ఆమోదం తర్వాత కేంద్రం అనుమతికి పంపుతారు. తాజాగా తీసుకున్న నిర్ణయం నగర ఉత్తర భాగ ప్రజలకు స్వీట్ న్యూస్ గా చెప్పొచ్చు.