మీకు వాషింగ్ మిషన్ ఉందా? ఏపీలో కొత్త సర్వే!
పేదలను నాలుగు వర్గాలుగా విభజించి.. వారిలో 20 శాతం మందికి ఈ పీ-4ను అమలు చేయనున్నారు.;
ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తగా కొన్ని పథకాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఇవి సూపర్ సిక్స్ కాదు. వాటిని మించిన పథకమని స్వయంగా సీఎం చంద్రబాబే చెబుతున్నారు. ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాల వ్యవహారం ఎలా ఉన్నా.. వచ్చే ఉగాది నుంచి అమలు చేయాలని భావిస్తున్న వినూత్న పథకం.. `పీ-4`. ఈ పథకం కింద.. అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. పేదలను నాలుగు వర్గాలుగా విభజించి.. వారిలో 20 శాతం మందికి ఈ పీ-4ను అమలు చేయనున్నారు.
ఇతమిత్థంగా చెప్పాలంటే.. పీ-4 ద్వారా.. పేదలను ఆ వర్గం ఉంచి బయటకు తీసుకువచ్చి, వారిని ఆర్థికంగా కొంత మేరకు సంప న్నులను చేయడమే లక్ష్యం. అయితే... ఈ పనిని ప్రభుత్వం నేరుగా చేయదు. సమాజంలో సంపన్నులు, ఎన్నారై వర్గాలు.. తమ తమ జిల్లాలకు ఏదైనా చేయాలని అనుకునే శ్రీమంతులకు పీ-4 పథకంలో ఎంపిక చేసిన పేదల జాబితాను అందిస్తారు. ఆయా సంపన్న వర్గాలు.. తమ ఆర్థిక సాయంతో ఈ పేదలను సంపన్నులుగా తీర్చిదిద్దనున్నాయి. అంటే.. వారికి చేతివృత్తులు నేర్పడమో.. పరిశ్రమలు చిన్నపాటివి పెట్టించడమో చేస్తారన్నమాట.
తద్వారా సమాజంలో 20 శాతం మంది అట్టడుగు పేదలను ఉద్ధరించి.. పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించుకున్నారు. అయితే.. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. దీనికి సంబంధించి సర్వే చేయను న్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వే ద్వారా.. వారి ఆర్థిక, ఆదాయపరిస్థితిని ప్రభుత్వం తెలుసుకుంటుంది. తద్వారా వారిని జాబితాలో చేర్చి.. వారికి సంపన్నుల నుంచి సాయం అందించే బాధ్యతను తీసుకుంటుంది. అయితే.. ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో కొన్ని ప్రశ్నలు రూపొందించారు. అవి ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
ఇవీ.. ప్రశ్నలు..
1) మీకు టీవీ ఉందా? ఉంటే ఎన్ని అంగుళాలు? అది స్మార్టా.. పాతదా?
2) రేషన్ కార్డు ఉందా? ఉంటే ఎన్నేళ్ల నుంచి రేషన్ తీసుకుంటున్నారు?
3) మీకు వాషింగ్ మిషన్ ఉందా?
4) సెల్ ఫోన్ ఉందా? ఉంటే.. అది స్మార్టా.. బటన్ ఫోనా? ఇంట్లో ఎంతమందికి ఫోను ఉంది?
5) ఇంట్లో ఎంత మంది పని లేదా ఉద్యోగం చేస్తారు?
6) వచ్చే ఆదయం ఎంత? ఖర్చులు ఎంత?
7) పిల్లలు ఎంత మంది? ఏం చేస్తున్నారు?
8) మీకు ఏసీ ఉందా? ఇంట్లో కంప్యూటర్ ఉందా?
9) ల్యాప్ టాప్ వాడడం వచ్చా?
.... ఇలా.. పలు ప్రశ్నల ద్వారా పీ-4 పథకానికి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. మరి ఎంత మంది ఈ జాబితాలో ఉంటారో చూడాలి.