ఖండాలు ఏడు... ఎనిమిదో ఖండం గురించి తెలుసా?
ఈ క్రమంలో తాజాగా ఈ కొత్త ఖండంతో కలిపి సరికొత్త మ్యాప్ ను సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు ఇది మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువ అని అన్నారు.
చిన్నప్పుడు స్కూళ్లలో ఖండాలు ఏడు, మహాసముద్రాలు ఐదు అని చదువుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై ఖండాలు ఎన్ని? అని అడిగితే.. ఎనిమిది అని చదువోవాల్సిన పరిస్థితి రావొచ్చని తెలుస్తుంది. కారణం... తాజాగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఈ కొత్త ఖండాన్ని గుర్తించారు. దీంతో ఇది ఎనిమిదో ఖండంగా కన్ ఫాం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు!
అవును... తాజాగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు టెక్టోనిక్స్ జర్నల్ లో కొత్త ఖండం విశేషాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ఖండానికి జిలాండియా లేదా టె రియు-ఎ-మౌయి అని నామకరణం చేశారు! సుమారు 94 శాతం నీటి అడుగున ఉందని చెబుతున్న ఈ కొత్త ఖండం... 4.9 మిలియన్ చదరపు కి.మీ. విస్తీరణంలో విశాలంగా ఉందని వెల్లడించారు.
ఈ క్రమంలో తాజాగా ఈ కొత్త ఖండంతో కలిపి సరికొత్త మ్యాప్ ను సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు ఇది మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువ అని అన్నారు. ఇక, ఇది చూడటానికి చాలా సన్నగా ఉందని చెప్పిన శాస్త్రవేత్తలు... ఈ ఖండాన్ని వెలికితీసేందుకు చాలా సమయం పడుతుందని.. దీన్ని అధ్యయనం చేయడం కూడా చాలా క్లిష్టతరం అని అన్నారు.
ఇక ఈ కొత్త ఖండాన్ని న్యూజిలాండ్ పశ్చిమతీరంలో క్యాంప్ బెల్ పీఠభూమి సమీపంలో కనుగొన్నట్లు తెలిపిన శాస్త్రవేత్తలు... ఈ ప్రాంతంలో అయస్కాంత క్రమరాహిత్యాలను కూడా గుర్తించాల్సి ఉందని అన్నారు. ఇది సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ అర్థగోళంలోని మొత్తం భూమిని ఈ కొత్త ఖండం కలిపిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు!
కాగా... 2017 లోనే ఈ కొత్త ఖండాన్ని గుర్తించినప్పటికీ... ఆ ఖండానికి సంబంధించిన వివరాలను మాత్రం తాజాగా బహిర్గతపరుస్తున్నారు. న్యూజిలాండ్ లోని విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్ స్టన్, ఆస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీనిని కనిపెట్టారు. ఇందులో ఆరుశాతం మాత్రమే పైకి కనిపిస్తుంది. మిగతా భుభాగమంతా నీటిలోనే ఉంటుంది.