పెట్రోల్-డీజిల్ ఓకే.. మరి వీటి సంగతేంటి నిర్మలగారూ!
అయితే.. గత 8 ఏళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో ఒక్క మాటే చెబుతున్నారు.
పెట్రోల్-డీజిల్ ధరలు.. దేశవ్యాప్తంగా ఎక్కువగాఉండడంతో ఇటు సాధారణ ప్రజలు, అటు రవణా రంగం కూడా తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అనేక పరిశ్రమలు కూడా .. ఈ ధరల దెబ్బతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇక, నిత్యవాసరాల ధరలు మండిపోవడానికి కూడా డీజిల్ ధరలే కారణం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా అవుతున్న నేపథ్యంలో ఆ ఖర్చులు కూడా వీటిపైనే పడుతున్నాయి. దీంతో ఎప్పటి నుంచో పెట్రోల్-డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావలన్నది.. ఇటు ప్రజల నుంచి, అటు పరిశ్రమ వర్గాలు, రవాణా వర్గాల నుంచి వినిపిస్తున్న డిమాండ్.
అయితే.. గత 8 ఏళ్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో ఒక్క మాటే చెబుతున్నారు. మాదేం లేదు.. రాష్ట్రాలు కలిసి కూర్చుని, చర్చించుకుని.. ఓకే అంటే.. మేం ఆ రెండు ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చేస్తాం.. వెంటనే ధరలు తగ్గిపోతాయని ఆమె చెప్పుకొస్తున్నారు. తాజాగా పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మరోసారి చర్విత చర్వణం(చెప్పిందే చెప్పడం) అన్నట్టుగా.. మాదేం లేదు.. అని నిర్మల సమాధానం ఇచ్చారు. సరిపుచ్చారు.
+ కట్ చేస్తే.. రాష్ట్రాల అనుమతి ఉంటేనే.. జీఎస్టీని అమలు చేస్తామని చెబుతున్న నిర్మలా సీతారామన్.. మరి అవే రాష్ట్రాలు టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీని తగ్గించాలని కోరినా.. స్పందించడం లేదు. పైగా పెంచుతున్నారు.
+ యూసీసీని అమలు చేయబోమని అనేక రాష్ట్రాలు చెప్పినా.. బలవంతంగా తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా? అంటే.. దీనికి సమాధానం లేదు.
+ కేంద్ర ప్రభుత్వ రంగ ఎఫ్ సీఐని బలోపేతం చేయాలని ధాన్యం, గోధుమలను మరింత ఎక్కువగా కొనుగోలు చేయాలని రాష్ట్రాలు కోరుతున్నా...? పట్టించుకుంటున్నారా? ఉద్యమాలు చేస్తున్నా.. వినిపించుకుంటున్నారా? అంటే.. దీనికి కూడా సమాధానం లేదు.
+ ఇప్పటికే గడువు తీరిన జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్‌ను ఎత్తేయాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు నివేదికలు ఇచ్చాయి. ఏ జాతీయ రహదారిపైనైనా.. 15 సంవత్సరాల వరకు టోల్ వసూలు చేసుకునే అవకాశం ఉంది. కానీ, 25 సంవత్సరాలు అయినా.. దేశవ్యాప్తంగా వసూలు చేసుకుంటున్నారు. పైగా పెంచుతున్నారు. దీనిపై స్పందించరా? ఎలా చూసుకున్నా.. తమకు మేలు చేస్తుందని అనుకుంటే.. ఒక విధంగా.. తమ కీడు చేస్తుందని భావిస్తే.. రాష్ట్రాలపై కి తోసేయడం కేంద్రానికి రివాజుగా మారిందన్న విమర్శల్లో వాస్తవాన్ని తోసిపుచ్చలేక పోతుండడం నిజం.