నిజామాబాద్ రూరల్.. ఈ సంగతి విన్నారా?
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్ రాజకీయాలు ఎక్కువగా సాగుతున్న నియోజకవర్గం నిజామాబాద్ రూరల్
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్ రాజకీయాలు ఎక్కువగా సాగుతున్న నియోజకవర్గం నిజామాబాద్ రూరల్. ఇక్కడ బీఆర్ఎస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. బీఆర్ ఎస్ నాయకుడు, ప్రస్తుతం టికెట్ కూడా పొందిన బాజిరెడ్డి గోవర్థన్.. సొంత పార్టీ నేతలను బలోపేతం చేసుకుంటూ.. ఇతర పార్టీల నుంచి నాయకులను ఆకర్షిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ తిరుగుతూ.. తనకు అనుకూలంగా ఉన్నవారికి పార్టీ కండువాలు కప్పేస్తున్నారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో ఆయన ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నా లు.. సైలెంట్‌గా సాగిపోతుండడం గమనార్హం.
ఎక్కడా హడావుడి లేదు. ఎక్కడా అట్టహాసం లేదు. అంతా సైలెంట్. గ్రామాల్లో పాదయాత్రలు చేయడం.. కొన్ని కొన్ని సార్లు అక్కడే నిద్రలకు ఉపక్రమించడం.. తెల్లవారి మళ్లీ ప్రచారానికి దిగడం.. ఇదే వ్యూహంతో బాజిరెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గ్రామీణ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. పైగా ఇక్కడ బీఆర్ ఎస్‌కు పట్టు కూడా ఎక్కువగా ఉంది. దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకున్న గోవర్ధన్‌రెడ్డి.. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. మరోవైపు ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో బీఆర్ ఎస్ హవా జోరుగా సాగుతోందని అంటున్నారు పరిశీలకులు.
ప్రధాన కుల సంఘాలను ఆయన తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులను తనవైపు తిప్పుకొని పార్టీలో చేర్చుకుంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ సర్కారు తీసుకువచ్చిన పథకాలను మరింతగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందనే వాదనను ఆయన బలంగా వినిపిస్తున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల హవా ఇంకా ప్రారంభం కాకపోవడం.. ప్రత్యర్థులు మేలుకునే లోపే.. తన వ్యూహాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలనే లక్ష్యంగా బాజిరెడ్డి ముందుకు సాగుతుండడం గమనార్హం.
ముఖ్యంగా తనపై ఉన్న మాస్ లీడర్ ఇమేజ్‌ను బాజిరెడ్డి వినియోగించుకుంటున్నారు. జక్రన్ పల్లి మండలంలోని పలు గ్రామాల నుంచి 100 మందికి పైగా బీజేపీ, కాంగ్రెస్ సానుబూతిపరులను తన వెంట తిప్పుకొన్నారు. అదేవిధంగా తొర్లికండ గ్రామంలో 300 మందిని, ముదిరాజ్ సంఘానికి చెందిన 150 మంది ప్రతినిధులను కూడా ఆయన తన వర్గంలో చేర్చుకున్నారు. అదేవిధంగా కీలకమైన డిచ్‌పల్లి మండలంలోనూ నాయకులను చేరదీస్తున్నారు. ఒకవైపు ప్రచారం.. మరోవైపు చేరికలతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి దూకుడుగా ఉండడం గమనార్హం. మరి ఇది ఏమేరకు ఆయనకు సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.