అంబటికి షాక్.. గ్రీన్ గ్రేస్ అపార్ట్ మెంట్ కు అనుమతులు రద్దు?

గ్రీన్ గ్రేస్ పేరుతో నిర్మించిన ఈ అపార్టుమెంట్ కు సరైన అనుమతులు లేవన్న విషయాన్ని గుర్తించిన అధికారులు నిర్మాణ అనుమతులు రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

Update: 2024-12-11 04:28 GMT

తప్పుడు పత్రాలతో.. నిబంధనలు ఏ మాత్రం ఫాలో కాకుండా నిర్మించిన భారీ భవన సముదాయానికి కూటమి సర్కారు అనుమతులురద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్న వైనం మాజీ మంత్రి అంబటి రాంబాబు అండ్ కోకు భారీ షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. అంబటి రాంబాబు సోదరుడు కమ్ పొన్నూరు ఇన్ ఛార్జి అంబటి మురళీక్రిష్ణ భారీ అపార్టుమెంట్ ను నిర్మించారు. గ్రీన్ గ్రేస్ పేరుతో నిర్మించిన ఈ అపార్టుమెంట్ కు సరైన అనుమతులు లేవన్న విషయాన్ని గుర్తించిన అధికారులు నిర్మాణ అనుమతులు రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

గుంటూరులోని పట్టాభిపురంలో అపార్ట్ మెంట్ నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన కార్పొరేషన్.. రైల్వే.. ఫైర్.. పీసీబీల నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకోలేదు. అంతేకాదు.. కార్పొరేషన్ కు చెల్లించాల్సిన ఫీజు కూడా కట్టలేదు. రైల్వే శాఖ కేవలం జీప్లస్4 నిర్మాణానికి అనుమతి ఇస్తే.. నాలుగు రెట్లు ఎక్కువగా నిర్మాణాలను నిర్మించటం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు తాము ఇచ్చిన అనుమతులకు భిన్నంగా భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపట్టిననేపథ్యంలో రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ వోసీని రద్దు చేసింది. ఇదంతా ఏడాది క్రితమే జరిగినా.. అప్పట్లో అంబటి అధికారంలో ఉండటంతో వారిని అడ్డుకునే వారే లేకపోయారు.

తాజాగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఈ ఇష్యూను తెర మీదకు తీసుకురావటం.. ప్రశ్నించటంతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రివైజ్డ్ ప్లాన్ తోనూ నిర్మాణదారుడు మోసంచేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు అవాక్కు అయ్యారు. రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ వోసీ రద్దు విషయాన్ని దాచి పెట్టేసి.. బరితెగింపునతో నిర్మాణం చేపట్టిన వైనం సంచలనంగా మారింది. దీంతో క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు జారీచేశారు.

ప్రతి అడుగులోనూ.. ప్రతి శాఖ నుంచి అనుమతులు లేకుండానే భారీగా నిర్మించిన ఈ నిర్మాణానికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై అంబటి అండ్ కో కోర్టును ఆశ్రయించటంతో రెండు వారాల పాటు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కార్పొరేషన్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే.. తమకు కోర్టు ఆదేశాలు రాతపూర్వకంగా తమకు అందలేదని.. వాటి కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ కోర్టునుంచి ఆదేశాలు రాని పక్షంలో చర్యలు చేపడతామని కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో.. ఈ వ్యవహారం అంబటి అండ్ కోకు భారీ షాకింగ్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News