ఇండియా కూటమి ఇంకెందుకు? ఓ రాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు ఇండియా కూటమిలో భాగమైన ఓ రాష్ట్ర సీఎం సైతం ఇంకెందుకు కూటమి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-09 13:30 GMT

కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సర్కారును కూలదోస్తామంటూ మూడేళ్ల కిందట ఘనంగా మొదలైంది ప్రతిపక్ష కూటమి. అప్పట్లో బిహార్ సీఎం నీతీశ్ కుమార్ చొరవతో ఏర్పడిన ఈ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టారు. కానీ, చివరకు ఆ నీతీశే కూటమికి జెల్లకొట్టారు. మళ్లీ బీజేపీతో కలిసిపోయారు. ఇక గత ఏడాది లోక్ సభ ఎన్నికలు, ఇటీవలి మహారాష్ట్ర, హరియాణా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఇండియా కూటమిది వైఫల్యమే. తేలిగ్గా గెలుస్తాం అనుకున్న జార్ఖండ్ లో చచ్చీచెడి విజయం.. అదికూడా హేమంత్ సోరెన్ చలవతో. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి మనుగడపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే శివసేన సైతం ఇదే వైఖరితో ఉంది. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగమైన ఓ రాష్ట్ర సీఎం సైతం ఇంకెందుకు కూటమి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో..

దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో అధికార ఆప్, ప్రతిపక్ష కాంగ్రెస్ విడిగా పోటీచేస్తున్నాయి. దీనికిముందు హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ అంగీకరించలేదు. ఇప్పుడు ఢిల్లీలో కూడా వేర్వేరుగానే రంగంలోకి దిగుతున్నాయి. ఈ పార్టీల వైఖరితో విసుగు చెందిన జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తూ.. ఒక్కటిగా లేనందున కూటమి కథ చాలించాలని వ్యాఖ్యానించారు.

ఎన్డీయే సర్కారును ఓడించేందుకు ‘ఇండియా’గా ఏర్పడినా.. కూటమి సమావేశాలు జరగకపోవడం బాధాకరం అని ఒమర్ మండిపడ్డారు. అసలు ఇండియాకు నాయకుడు ఎవరు అని ప్రశ్నించారు. ఎజెండా ఏంటి..? ముందుకువెళ్లేది ఎలా? అని చర్చలు జరిగిన వైనమే లేదంటూ నిలదీశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ దక్కకుండా చేశామని.. అలాంటిది కూటమి భవిష్యత్ పై ఇప్పుడు స్పష్టత కొరవడిందని వ్యాఖ్యానించారు. కలిసి ఉంటామా? లేదా? అనే విషయంపై స్పష్టత లేకపోవడాన్ని తప్పుబట్టారు.

ఢిల్లీ ఎన్నికల తర్వాత కూటమి పార్టీలన్నీ సమావేశం కావాలని ఒమర్ సూచించారు. లేదా లోక్ సభ ఎన్నికల కోసమే కూటమి కట్టినట్లయితే పొత్తుకు స్వస్తి పలకాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలవాలంటే ఉమ్మడిగా ఉండాలని హితవు పలికారు. ఈ దిశగా చర్చలు జరిపి స్పష్టతకు రావాలని పిలుపునిచ్చారు.

ఇండియా కూటమిలో ఒమర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మొదటినుంచి ఉంది. ఇటీవలి కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని నెగ్గింది. మరోవైపు ఒమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లా దేశంలోనే సీనియర్ నాయకుడు. మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి కూడా. అలాంటి పార్టీకి చెందిన సీఎం నుంచి ఇండియా కూటమిపై వ్యాఖ్యలు రావడం గమనార్హం.

Tags:    

Similar News