పాక్ బంగ్లాదేశ్ ఒక్కటిగా... భారత్ కి షాకేనా ?
పొరుగు దేశాలు భారత్ మీద గురి పెట్టి ఉన్నాయి. ఒకనాడు అఖండ భారతంలో భాగంగా ఉన్న దేశాలే ఈ రోజు విడిపోయి భారత్ కి సవాల్ గా మారిన సంగతి తెలిసిందే
పొరుగు దేశాలు భారత్ మీద గురి పెట్టి ఉన్నాయి. ఒకనాడు అఖండ భారతంలో భాగంగా ఉన్న దేశాలే ఈ రోజు విడిపోయి భారత్ కి సవాల్ గా మారిన సంగతి తెలిసిందే. దేశ విభజన జరిగినపుడు పాకిస్తాన్ ఏర్పాటు అయింది. గట్టిగా పాతికేళ్ళు కాకుండానే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా విడిపోయింది.
అలా విడిపోవడానికి భారత్ తన శక్తివంచన లేకుండా ఎంతగానో కృషి చేసింది. ఒక కొత్త దేశాన్ని తన మిత్ర దేశాన్ని అలా సృష్టించామని పాక్ పీచమణచి సగానికి సగం బలహీనం చేశామని ఇంతకాలం అనుకుంటూ వచ్చిన భారత్ కి చరిత్ర అడ్డం తిరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది.
ఏనాడూ ఊహించని మైత్రిగా పాకిస్థాను బంగ్లాదేశ్ ల మధ్య మొలిచింది. అది ఎంతదాకా వెళ్ళింది అంటే షేక్ హసీనను మాజీ ప్రధాని చేయడంలో పరోక్ష హస్తంగా పాక్ ఉందని అనుమానించిన వారికి ఇపుడు ఎదురుగా అదే దేశం నిలిచి బంగ్లాదేశ్ భుజాన చేయి వేసి మరీ తన ఉత్తమ మిత్రుడిగా చేసుకుంటూ భారత్ కి కన్ను గీటుతోంది.
ఈ రోజున చూస్తే పాక్ బంగ్లాదేశ్ మైత్రి ఎంతలా కొత్త పుంతలు తొక్కుతోంది అంటే బంగ్లాదేశ్ సైనికులకు పాకిస్థాన్ శిక్షణ ఇస్తుందిట. వారికి కొత్త యుద్ధ రీతులు చెబుతుందిట. మరి ఇదంతా ఎందు కోసం బంగ్లాదేశ్ మీద ప్రేమ తోనా అంటే కానే కాదు అని అందరికీ తెలిసిందే ఏదో విధంగా భారత్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పాకిస్థాన్ ఇపుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది.
తన శాశ్వత శతృవుగా బంగ్లాదేశ్ ని అర్ధ శతాబ్ద కాలం పాటు చూసిన పాకిస్తాన్ ఇపుడు స్నేహ హస్తం అందిస్తోంది. బంగ్లాదేశ్ కూడా పాతికేళ్ల పాటు పాకిస్తాన్ తో కలసి ఉన్న సమయంలో పెట్టిన బాధలను మరచి అంతే దూకుడుగా పాక్ చేయిని అందుకుంటోంది.
ఇలా రెండు దేశాలు ఒక్కటి కావడం భారత్ పట్ల నిప్పులు కురిపించడం అన్నది మాత్రం చూస్తే కనుక భారత్ కి కొత్త ఇబ్బందులు సృష్టించేందుకు ఈ చెలిమి అన్న చర్చ సాగుతోంది. ఇప్పటిదాకా బంగ్లాదేశ్ భారత్ కి మిత్రురాలిగా ఉంది. భారత్ కూడా ఆ దేశంతో చెలిమిని చేస్తూ తన ఇతోధిక సాయాన్ని అందిస్తూ ఒక్క పాక్ తోనే పోరాడుతూ వస్తోంది.
ఇపుడు రెండు దేశాలూ ఒక్కటి అవుతున్నాయటే ఆనాటి ఇందిరమ్మ వ్యూహాలు నీరు కారిపోయాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏ బంగ్లా జాతీయుల విమోచన కోసం భారత మాత తన బిడ్డలు అయిన వేలాది మంది సైనికులను బలిదానంగా చేసిందో ఆ త్యాగానికి గుర్తింపు లేదా అన్న ఆవేదన కూడా కలుగుతోంది.
పాక్ అంటేనే కుయుక్తులకు మారు పేరు. ఆ దేశం భారత్ కి అవతల వైపు ఉన్న చైనాతో స్నేహం చేస్తూ భారత్ కి పక్కలో బల్లెంగా మారుతోంది. ఇపుడు మరో దిక్కున ఉన్న బంగ్లాదేశ్ ని కూడా తన వైపు తిప్పుకుని భారత్ మీద పూర్తిగా గురి పెట్టడానికి చూస్తోంది. ఇది నిజంగా భారత్ కి ఒక అగ్ని పరీక్షంగా పేర్కొంటున్నారు. ఈ కీలక సమయంలో భారత్ తన విదేశాంగ నీతిని రీతిని మరో మారు పదును పెట్టి కుత్సిత పాక్ కి తగిన గుణపాఠం చెప్పాలని అంతా కోరుకుంటున్నారు ఇక బంగ్లాదేశ్ భారత్ దారికి వస్తుందా లేదా అన్నది కూడా కాలమే జవాబు చెప్పాలని అంటున్నారు.