సీన్లోకి వచ్చిన పనామా అధ్యక్షుడు.. ట్రంప్ కు సూటి సమాధానం!

అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నదే.

Update: 2025-01-23 04:56 GMT

అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నదే. అమెరికా అధ్యక్షుడి హోదాలో పలుమార్లు పనామా కాలువ గురించి.. దాని యాజమాన్య హక్కుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ నోటి నుంచి తరచూ వచ్చే పదాల్లో కెనడా.. పనామా కాలువ.. లాంటివి వస్తుంటాయి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో సీన్లోకి వచ్చారు. పనామా కాలువను తమకు అమెరికా ఏమీ బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేశారు. అది తమ దేశానికి సొంతమన్న ఆయన.. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. ఇటీవల కాలంలో ట్రంప్ మాటల్లో.. ట్రంప్ కాలువను తాము సొంతం చేసుకుంటామని.. తప్పనిసరిగా వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు.

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ములినో మాట్లాడుతూ.. పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.దీనికి కారణాన్నిచెబుతూ.. ‘‘అదంతా అవాస్తవం. ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో.. బహుమతిగానో వచ్చింది కాదు. అది మాది. మాకు మాత్రమే సొంతం’ అని స్పష్టం చేశారు.

ఇంతకూ పనామా కాలువ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ప్రమాణస్వీకారోత్సవం తర్వాత చేసిన ప్రసంగంలో మాట్లాడుతూ.. పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని.. తాము దానిని చైనాకు ఇవ్వలేదని.. పనామాకు ఇచ్చామని పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ములినో రియాక్టు అయ్యారు. అంతేకాదు..పనామా కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదన్న ఆయన..ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరన్నారు. ఇంతకూ పనామా కాలువను ఎవరు నిర్మించారన్న విషయాన్ని చరిత్రలోకి వెళితే..ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

1914లో పనామా కాలువను అమెరికా నిర్మించింది. అయితే.. పనామా దేశంతో జరిగిన ఒప్పందం మేరకు 1999లో ఆ కాలువను ఆ దేశానికి తిరిగి అప్పగించింది. అయితే.. అమెరికా వాణిజ్య.. నౌవికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా పీజుల్ని వసూలు చేస్తోందని.. వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలా కుదరకుంటే.. పనామా కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పనామా అధ్యక్షుడు సీన్లోకి వచ్చి.. పనామా కాలువను అమెరికా తమకు బహుమతిగా ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో.. పనామా అధ్యక్షుడి వ్యాఖ్యలకు ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News