ఎమ్మెల్యే పార్థసారథి ఏమి చెప్పాలనుకున్నట్లు?
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా... అధికార వైసీపీలో సీట్ల మార్పు, చేర్పులు బలమైన చర్చకు దారితీస్తున్నాయి.
ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా... అధికార వైసీపీలో సీట్ల మార్పు, చేర్పులు బలమైన చర్చకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం మారుతున్నాయి. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, కీలక నేతలు సైతం... జగన్ తీసుకునే నిర్ణయాలు పార్టీ క్షేమం కోసమే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటాం అని చెబుతుంటే... మరికొంతమంది మాత్రం చెప్పాలనుకున్న విషయాన్ని ఏదో రకంగా చెప్పేస్తున్నరు.
అవును... ఇన్ ఛార్జ్ ల మార్పు విషయంలో చాలా మంది మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్లు, కీలక నేతలు సానుకూలంగా స్పందిస్తున వేళ.. మరికొంతమంది మాత్రం కాస్త అటు ఇటుగా తమ బాధను, చెప్పాలనుకున్న విషయన్ని చెప్పేస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఎమ్మెల్యే పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. తోటి ఎమ్మెల్యేలే ఆగ్రహం వ్యక్తం చేసేలా ఆ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం
తాజాగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... దురదృష్టవశాత్తూ మన ప్రియతమ నాయకుడు జగన్ తనను గుర్తించకపోయినప్పటికీ.. ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తించారు. వారి గుండెల్లో పెట్టుకుని, ఎటువంటి అవమానాలు ఎదురైనా తనను కాపాడుతూ వస్తున్నారు అని కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో... వైసీపీ సామాజిక బస్సు యాత్ర సభలో పాల్గొన్న పార్థసారథి మాట్లాడుతూ... నామినేషన్ వేసిన ప్రతీసారి పార్థసారథి ఓడిపోయాడని.. పెనమలూరు తెలుగుదేశందేనని చెప్పుకుంటుందని.. అయితే... అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో తాను గెలుస్తున్నట్లు పార్థసారథి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ ఛార్జ్ ల మార్పులు చోటు చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతున్న వేళ పార్థసారథి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇలా జగన్ తనను గురించలేదన్నట్లుగా ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యనించిన సమయంలో అక్కడే ఉన్న జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదిక దిగి వెళ్లిపోయారు. నేతలు ఆపుతున్నా.. రమేష్ ఆగకుండా వెళ్లిపోవడం గమనార్హం. దీంతో... సీఎం జగన్ తనను గుర్తించలేదని ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించడం పార్టీ నేతల్లో ఆగ్రహం వచ్చేలా చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.