కుంభమేళా ఎఫెక్ట్.. ట్రైన్ ఏసీ కోచ్ అద్దాలు బద్దలు.. వీడియో వైరల్!
రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు ఈ మహా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొపక్క.. ఫిబ్రవరి 26తో ఈ మహా కుంభమేళా కార్యక్రమం ముగియనుంది.
దీంతో... వీలైనంత తొందరగా పాల్గొనాలని భక్తులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ప్రయాగ్ రాజ్ కు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరోపక్క ట్రైన్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ సమయంలో.. సమయం లేదు మిత్రమా అంటూ పలువురు ప్రయాణికులు ట్రైన్ అద్దాలు బద్దలుకొట్టిమరీ ఎక్కుతుండటం గమనార్హం.
అవును... కుంభమేళాలో పాల్గొనాలని ప్రయత్నంలో ఉన్న భక్తుల కారణంగా రైల్వే స్టేషన్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లోని రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. రైల్లో కూర్చొనేందుకు స్థలం దొరకకపోవడంతో ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో స్వతంత్ర సెనాని ఎక్స్ ప్రెస్ కిక్కిరిసిపోయింది. లోపల మరో ప్రయాణికుడు కాలు పెట్టడానికి కూడా అవకాశం లేనంతగా నిండిపోయింది. దీంతో... అధికారులు డోర్లు మూసేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏది ఏమైనా సరే ట్రైన్ ఎక్కాలని నిర్ణయించుకున్నట్లున్నారు.
అంతే.. ఆగ్రహంగా ఏసీ కోచ్ విండో అద్దాలు పగులగొట్టి.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురుకి స్వల్పంగా గాయాలయ్యాయని తెలుస్తోంది. ఆ సమయంలో రైల్వే పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేకపోయారని అంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సుమారు 25 నిమిషాల పాటు రైలు నిలిచిపోయిందని చెబుతున్నారు.
కాగా... మహా కుంభమేళాలో ఇప్పటివరకూ సుమారు 45 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా "అమృత స్నానాలు" మిగిసిన సంగతి తెలిసిందే. మరోపక్క ఈ నెల 26 సమీపిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు.