పవన్ చేసిన పనికి వైసీపీ నోరెత్తగలదా ?

ఆ విధంగా పవన్ వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేశారు. అంతే కాదు ఫ్యూచర్ లో నోరెత్తకుండా చేయగలిగారు.

Update: 2024-10-02 08:08 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేశపరుడే కాదు, ఆలోచనాపరుడు కూడా. తన వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే దానిని వెంటనే సరిచేసుకునే నైపుణ్యం సత్తా కూడా ఆయనకు ఉన్నాయి. ఇదిలా ఉంటే జగన్ ని తిరుమల రాకుండా అడ్డుకున్నది టీడీపీ కూటమి అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు.

ఇక జగన్ విషయానికి వస్తే ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడితే హ్యాపీగా స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అని కూడా కూటమి నేతల నుంచి బదులు వచ్చింది. జగన్ కి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేనందువల్లనే ఇలా చేశారు అని కూడా విమర్శలు చేసింది.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ ని వివాహం చేసుకున్నారు అని ఆయన ఇద్దరు పిల్లలూ క్రిస్టియన్లు కాబట్టి వారి చేత డిక్లరేషన్ తీసుకుంటారా అని కూడా వైసీపీ ప్రశ్నించింది. ఇదిగో దానికి జవాబు అన్నటుగా పవన్ కళ్యాణ్ తన చిన్న కూతురు. ఫలీనా అంజని చేత డిక్లరేషన్ మీద సంతకాలు చేయించారు. అంతే కాదు ఆమె మైనర్ అయినందువల్ల పవన్ కూడా తండ్రిగా సంతకాలు చేశారు.

ఆ విధంగా పవన్ వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేశారు. అంతే కాదు ఫ్యూచర్ లో నోరెత్తకుండా చేయగలిగారు. ఇపుడు తన కూతురుతో పాటు తండ్రిగా పవన్ కూడా డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టినందున వైసీపీ చేసిన విమర్శలు పూర్తిగా కొట్టుకుని పోయాయి. పవన్ చేత డిక్లరేషన్ సంతకం పెట్టించగలరా అని మాజీ మంత్రుల నుంచి సీనియర్ నేతల దాకా అందరూ ఆడిపోసుకుంటూ అన్న మాటలకు పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బతో బదులిచ్చేశారు.

ఇక జగన్ సంగతేంటి అని ఆయన చెప్పకనే ప్రశ్నించినట్లు అయింది. నిజానికి జగన్ కూడా హుందాగా డిక్లరేషన్ మీద సంతకం పెడితే పోయేది కదా అన్న మాట కూడా ఉంది. స్వామి వారి మీద విశ్వాసం ఉన్నపుడు ఎన్నో సార్లు ఆయనను దర్శించుకున్నపుడు డిక్లరేషన్ మీద ఒక్క సంతకం చేస్తే పోయేది ఏమి ఉంది అన్న వారూ ఉన్నారు.

కేవలం దీనిని వివాదం చేయడానికి టీడీపీ కూటమి చూసింది అని చెప్పుకోవడం కోసమా లేక తాను డిక్లరేషన్ మీద సంతకం చేసేందుకు ఏ మాత్రం సుముఖంగా లేనందువల్లనా అన్న చర్చ వస్తోంది. పవన్ అయితే తాను డిమాండూ చేయగలనూ అదే సమయంలో తన వైపు నుంచి ఎవరైనా వేలెత్తి ప్రశ్నించకుండా తాను చేయాల్సింది చేయగలనూ అని నిరూపించుకున్నారు

ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఆదర్శవంతమైన పొలిటీషియన్ గా నిలిచారు అని అంటున్నారు. అంతే కాదు శ్రీవారి భక్తుడిగా ఆయన తన విశ్వాసాన్ని ఈ విధంగా మరో మారు చాటుకున్నారు అని కూడా అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఏడు కొండలూ కాలి నడకన నడచి స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా తన భక్తిని చాటుకుని యువతకు స్పూర్తిగా నిలిచారు అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ని చాలా విషయాల్లో ఎవరూ వంక పెట్టలేరని ఒకవేళ ఏమైనా విమర్శలు చేయాలనుకున్నా ఆయన వాటికి మొదట్లోనే చెక్ పెట్టేస్తారు అని చెప్పడానికే తాజా డిక్లరేషన్ ఒక ఉదాహరణ అని అంటున్నారు.

Tags:    

Similar News