మరో పదేళ్లు చంద్రబాబే సీఎం: పవన్

ఐదేళ్లు కాదు...మరో పదేళ్లు చంద్రబాబే సీఎంగా కొనసాగాలని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-20 11:55 GMT

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలతో ఎన్డీఏ కూటమి ఏర్పడడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు నాయకత్వం పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఐదేళ్లు కాదు...మరో పదేళ్లు చంద్రబాబే సీఎంగా కొనసాగాలని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాము చేయాల్సిన పనులపై చంద్రబాబు ఆదేశాలివ్వాలని పవన్ అన్నారు. చంద్రబాబు ప్రతిభా పాటవాలు చూపించాలని, చంద్రబాబు విజన్ కు తగ్గట్టుగా పనిచేస్తామని చెప్పారు. ఆయన కలలను సాకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ ప్రకటించారు. ఇదే స్ఫూర్తిని చంద్రబాబు కొనసాగించాలని పవన్ ఆకాంక్షించారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి చంద్రబాబు కారణమని, ఆయన విజన్ కారణమని పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తుపై చంద్రబాబు నమ్మకాన్ని తీసుకువచ్చారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు అని అన్నారు. 150 రోజుల కూటమి పాలనతో పూర్తిగా సంతృప్తి చెందామని, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని అన్నారు.

ఇక, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తీర్చే బాధ్యత తనదని పవన్ చెప్పారు. రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అని, దేశంలోనే జల జీవన్ మిషన్ అమలులో ఏపీ తలమానికంగా ఉండేలా చేస్తానని చెప్పారు. గ్రామానికి, మండల కేంద్రానికి 3 లక్షల ఖర్చు పెడితే ఆర్వో ప్లాంట్లు వచ్చేవని, గత ప్రభుత్వం దానిపై దృష్టి సారించలేదని పవన్ విమర్శించారు.

Tags:    

Similar News