పవన్ జీ...ఇది వ్యూహమా..లేక వినయంతో కూడిన వైనమా ?

సరే ఇవన్నీ పక్కన పెడితే పవన్ కి ఈ విషయంలో ఏదైనా వ్యూహం ఉందా అన్నది కూడా చూడాల్సి ఉంది. వ్యూహం కనుక ఉంటే కరెక్ట్.

Update: 2024-10-15 02:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫక్తు రాజకీయ నాయకుడు కాదు, ఆయన సినీ హీరో. వెండి తెర మీద ఆయన పండించే నటన అభిమానులకు ఎంతో హుషార్ ఇస్తుంది. ఇక రియల్ లైఫ్ లో పవన్ ఒకింత నిజాయతీతో ఉండాలనే చూస్తారు. అయితే ఆయన రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి అసలు పొంతన లేని పొలిటికల్ లైఫ్ ని ఎంచుకున్నారు. రఫ్ అంట్ టఫ్ గా ఉండే ఈ ఫీల్డ్ లో పవన్ ఎలా అడ్జస్ట్ అవుతారు అన్నదే మొదటి నుంచీ ఉంది.

అయితే పవన్ తనదైన ఎన్నో భావాలను గడచిన పదేళ్లలో మీడియా ముఖంగా జనాలకు చేరవేశారు. అలా పవన్ లో వివిధ రకాల షేడ్స్ ని జనాలు చూడగలిగారు. ఆయన ఎన్ని చెప్పినా పరస్పర విరుద్ధ భావజాలంతో ముందుకు సాగినా ఒక్కటి మాత్రం జనాలు నమ్మారు. అదే ఆయనకు జనాలకు ఏదో చేయాలని తపన అయితే ఉంది అని.

ఇక పవన్ రాజకీయంగా ఎన్ని రకాలైన విన్యాసాలు చేసినా ఆయనకు పెట్టని కోటగా రక్షణ కవచంగా అభిమాన కోటి ఉంది. వారికి పవన్ ఏమి చేసినా రైరేటో రైటే. పవన్ అన్న మూడు అక్షరాలే వారికి మంత్రాక్షరాలు. దాంతో పవన్ ని ఆ బలమే నేటికీ రాజకీయంగా నిలిపింది. జనసేనకు ఊపిరి అయింది.

ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరూ కూడా తన కంటే తోపు ఎవరూ లేరు అని అనుకుంటారు. అలా అనుకోవాలి కూడా రాజకీయ క్రీడనే అలాంటిది. నేను గొప్పవాడిని, నేనే నంబర్ వన్ అని జనాలకు చెప్పకపోతే వారు ఎందుకు గెలిపిస్తారు. అందువల్ల ఇది ప్రాథమికంగా ఉండాల్సిన లక్షణమే.

కానీ చిత్రంగా పవన్ మాత్రం తన గురించి తన పార్టీ గురించి ఎంత వరకూ చెప్పుకుంటున్నారో తెలియదు కానీ చంద్రబాబు గురించి మాత్రం చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. బాబు ఈజ్ గ్రేట్ అంటూంటారు. ఆయనను మించిన పొలిటీషియన్ లేరు అని కూడా అంటూంటారు. అఫ్ కోర్స్ ఆయనకు జాతీయ స్థాయిలో మోడీని మించిన నేత కూడా వేరే లేరు లెండి.

ఇలా పవన్ మోడీ బాబు ఈ ఇద్దరి గురించే ఎక్కువగా చెబుతారు. ఈ ఇద్దరూ తమ ప్రతిభను చాటుకున్నారు. వారి ప్రతిభకు తగినట్లుగా అవకాశాలు కూడా జనాలు ఇచ్చారు. వారి మీద పవన్ కి ప్రేమ అభిమానం ఉండకూడదని ఎవరూ అనరు కానీ తాను తన పార్టీ కూడా ముందున ఉండాలి కదా అని కూడా అంటున్న వారే ఎక్కువ.

పవన్ చుట్టూ రక్షణ వలయంగా అభిమాన గణం ఉందని చెప్పుకున్నాం కదా అలాగే ఆయన మీదనే ఆశల మోసులు పెట్టుకుని ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఉంది. ఎపుడూ ఆ రెండు పార్టీలేనా అంటూ తమ వారూ అందలం ఎక్కాలని ఆ వర్గం ఆశగా చూస్తోంది. ఆ ఆశలన్నీ పవన్ మీదనే పెట్టుకుంది.

పవన్ రాజకీయంగా చూస్తే కొత్తగా వచ్చిన వారు అయితే కాదు ఆయన రాజకీయ రంగ ప్రవేశం 2008లో ప్రజారాజ్యం పార్టీ తరఫున యువజన విభాగం అధ్యక్షుడిగా జరిగింది అని చెప్పాలి. అంటే ఈనాటికి ఆయన అనుభవానికి 16 ఏళ్ళు అచ్చంగా నిండాయి.

మరి ఇంత అనుభవం ఉన్న పవన్ వేరే వారి అనుభవాన్ని చూసి ఇంకా స్పూర్తి పొందే దశలోనే ఉన్నాను అనడం అయితే ఆయన రక్షణ వలయానికి కానీ నమ్మిన బలమైన వర్గానికి కానీ నచ్చడం లేదు అని అంటున్నారు. రాజకీయాలోనే కాదు ఏ రంగంలోనూ ఎవరూ పరిపూర్ణుడు కాదు, నిత్య విద్యార్ధులే. అంతమాత్రం చేత వారు ఎప్పటికీ విద్యార్ధులుగా మిగిలిపొమ్మని కానే కాదు కూడా.

అందువల్ల పవన్ కూడా అనుభవశాలే అన్నది ఆయన ఫ్యాన్స్ భావన. ఇక క్రెడిట్స్ మెరిట్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే రాజకీయాల్లో ఉన్న వారు తామే గ్రేట్ అనుకోవాలి. అపుడే జనాలు కూడా ఆ వైపు చూస్తారు. పొత్తులో ఉన్న పార్టీగా మిత్రులను గౌరవించారు. కానీ తనకు మాలిన ధర్మతో కాదు కదా అన్న మాట కూడా ఉంది.

జనసేన సూపర్ హిట్ కావాలి పవన్ సీఎం కావాలి అన్నది కోట్ల మంది కోరికగా ఉన్న వేళ ఆ దిశగా తన పార్టీని మరింతగా పటిష్టం చేసుకుని ముందుకు సాగితే బాగుంటుంది అన్నదే ఒక సూచనగానూ వస్తోంది. టీడీపీని ఎంత పొగిడినా దాని వారసత్వం అయితే పవన్ కి రానే రాదని కూడా అంటున్నారు. ఇక ప్రజలు కూడా ఆల్టరేషన్ కోసం చూస్తూనే ఉంటారు.

అందువల్ల పవన్ కూడా తన అనుభవాన్ని పండించుకుని రాజకీయంగా అగ్ర స్థానానికి చేరాలని తన పార్టీ జెండాను గట్టిగా ఎగరేయాలని కోరుతున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే పవన్ కి ఈ విషయంలో ఏదైనా వ్యూహం ఉందా అన్నది కూడా చూడాల్సి ఉంది. వ్యూహం కనుక ఉంటే కరెక్ట్. లేకపోతే మాత్రం తీరు మార్చుకోవాల్సిందే అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News