జగన్ కి నో చాన్స్ అంటున్న పవన్... గేమ్ ప్లాన్ అదేనా?
అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ మాత్రమే టోటల్ గా విపక్ష రాజకీయ మైదానంలో గేమ్ ఆడుతోంది.
ఏపీలో అన్ని ప్రధాన పార్టీలూ అధికారంలో ఉన్నాయి. టీడీపీ జనసేన బీజేపీ కలసి కూటమి కట్టాయి. ఈ మూడు పార్టీల ప్రభుత్వం రాజ్యం చేస్తోంది. ఇక విపక్షంలో చూస్తే కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నా పెద్దగా ఉనికి చాటుకోవడం లేదు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ మాత్రమే టోటల్ గా విపక్ష రాజకీయ మైదానంలో గేమ్ ఆడుతోంది.
టీడీపీ కూటమిలో వ్యతిరేకత ఏమైనా వస్తే గుత్తమొత్తంగా అందుకునేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. 2024 ఎన్నికల్లో పవన్ చేసినది ఏంటి అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వ్యూహ రచన చేయడం. అంటే అన్ని ప్రధాన పార్టీలను ఆయన కలపడం. దాని వల్ల వైసీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బ పడిపోయింది. 57 శాతం ఓటు బ్యాంక్ టీడీపీ కూటమి పరం అయింది. అలా బంపర్ విక్టరీ దక్కింది.
ఇదిలా ఉంటే అదే వ్యూహం ఇపుడు వైసీపీకి వరంగా మారుతోంది అని అంటున్నారు. ఎందుకంటే అన్ని పార్టీలూ అధికారంలో ఉంటే వైసీపీ కోరకుండానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే చాన్స్ ఉండదు. ఏకైన విపక్షం వైసీపీ కావడమే అందుకు కారణం.
దాంతోనే వైసీపీ కూడా ధీమాగా ఉంది. జగన్ కూడా తన పార్టీ అనుచరులకు అదే చెబుతూ వస్తున్నారు కూటమి పట్ల వ్యతిరేకత ఆరు నెలలలోనే వచ్చింది. ఇది మరింత పెరిగి పెద్దది అయితే 2029 ఎన్నికల్లో వైసీపీకి తిరుగు ఉండదని ఆయన ధైర్యం నూరిపోస్తున్నారు.
అయితే టీడీపీ కూటమిలో ఉన్న జనసేన మాత్రం జగన్ కి సోలోగా ఆ చాన్స్ ఇచ్చేది లేదంటోంది. అందుకే పవన్ ప్రభుత్వంలో ఉంటూ కూడా ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శలు చేస్తున్నారు. గతంలో ఏపీలో వరసగా కొన్ని సంఘటనలు జరిగినపుడు లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ బిగ్గరగా మాట్లాడారు.
తద్వారా ఆయన ప్రభుత్వం సరిద్దుకునేలా వ్యవహరించారు అని అంటున్నారు. అదే సమయంలో విపక్షం పాత్ర వైసీపీ కంటే పవనే ప్రభుత్వంలో ఉంటూ కూడా బాగా పోషించారు అని కూడా అంతా అంటూ వచ్చారు. అదే విధంగా ఆయన తరచూ అధికార వర్గాలను హెచ్చరిస్తున్నారు. పాలనా పరంగా తప్పులు చేయవద్దు అని సూచిస్తున్నారు
ఇపుడు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో సైతం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అలాగే టీటీడీ తరఫున క్షమాపణలు చెప్పించేలా చూసారు. అధికారులు కూడా అలెర్ట్ గా ఉండాలని గట్టి సందేశం పంపించారు. అదే సమయంలో ఆయన కాసింత ఘాటుగానే మట్లాడారు, బాధితుల పక్షాన ఆయన ఆవేదనను వినిపించారు. వారి కన్నీటి కధలు చూసి కరిగిపోయాను అంటూ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కూడా ఆయన పోలీసు వ్యవస్థ లోపాలను కూడా ఎత్తి చూపారు
తాను ఇటువంటిది సహించేది లేదని కూడా ఆయన ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా పవన్ మాట్లాడడం వల్ల విపక్ష వైసీపీకి చాన్స్ లేకుండా చేశారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన ఉంటున్నా సమయం వచ్చినపుడు ప్రజా కోణంలో నుంచి ప్రజాపక్షంగా ఆయన మాట్లాడుతున్న తీరుతో బాధ్యతను చాటుకుంటున్నారు
ఆ విధంగా ఆయన విపక్షానికి ఎక్కడా చాన్స్ లేకుండా చేస్తున్నారు. నిజానికి తిరుమల తొక్కిసలాట ఉదంతం జాతీయ స్థాయిలో హైలెట్ అయింది. దానికి చంద్రబాబు సీఎం గా తీసుకున్న చర్యలతో పాటు పవన్ కళ్యాణ్ పూర్తిగా భక్తుల పక్షాన నిలిచి మాట్లాడిన దాంతో మొత్తం పెద్ద ఇష్యూ కూడా చాలా వరకూ ప్రభావం తగ్గిపోయింది. ఒక విధంగా పవన్ నిర్మాణాత్మక మిత్ర పక్షంగా అదే సమయంలో ఒకింత ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ వాయిస్ ఎక్కడా బయటకు రాకుండా అడ్డుకుంటున్నరని అంటున్నారు. ఈ గేమ్ ప్లాన్ తో పవన్ సక్సెస్ అవుతున్నారని అంటున్నారు. మరి ఇపుడు వైసీపీ ఏమి చేయాలో ఆలోచించుకోవాల్సి ఉందని అంటున్నారు.