రెండు పడ‌వ‌ల‌పై ప‌వ‌న్ ప్ర‌యాణం.. సాధ్య‌మేనా..?

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగుల‌కు మ‌రోసారి సిద్ధమవుతున్నారనే వార్త అందరికీ తెలిసిందే.

Update: 2024-07-08 06:07 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగుల‌కు మ‌రోసారి సిద్ధమవుతున్నారనే వార్త అందరికీ తెలిసిందే. తను సినిమాల్లో నటిస్తానని ఇటీవల పిఠాపురంలో జరిగిన సభలో ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని సినిమాలు కూడా ఆయన పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న తీరు గమనిస్తే అన్ని విభాగాల నుంచి ఆయన సమాచారం సేకరిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు శాఖలపై పవన్ కళ్యాణ్ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంత్రిగా ఆయనకు మంచి అవకాశం.

పంచాయతీరాజ్ శాఖ అత్యంత కీలకమైన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి తర్వాత అంతటి పాలన చూపించేటటువంటి స్కోప్ ఉన్నటువంటి శాఖ పంచాయతీరాజ్ శాఖ. అటవీ శాఖ కొంత‌ పరిమితమైందే. కొన్ని కొన్ని కీలక విషయాల్లో అదికూడా ముఖ్య భూమికి పోషిస్తుంది. ఉదాహరణకు అమరావతి రాజధాని కోసం అటవీ ప్రాంత సేకరణ చేయాల్సి ఉంది. అలాగే పోలవరం కోసం అటవీ ప్రాంత భూములు అవసరం ఉంది. ఉత్తరాంధ్రలో నిర్మించే ప్రాజెక్టుల కోసం అటువైపు సేకరణలు చేయాలి.

అదేవిధంగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని రవాణా అరికట్టడానికి కూడా మంత్రిగా పవన్ కళ్యాణ్ ముందు గురుత‌ర బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మంత్రిగా ఆయన ఒక మేలిమి నిష్ణాతుడు అవటానికి ఇదొక మంచి అవకాశం. అయితే త్వరలోనే ఆయన సినిమా రంగంలోకి మళ్ళీ ప్రవేశిస్తుండడం తద్వారా కళారంగాన్ని వదులుకోబోన‌ని చెప్పడం ద్వారా ఆయన సినిమా రంగంలోకి వెళ్లడం స్పష్టమైంది. అయితే ఇది ఎంతవరకు మంచిది? అనేది ఆసక్తిగా మారింది.

ఎందుకంటే ఒకవైపు పార్టీని బలోపేతం చేయాలి, మంత్రిగా త‌న శాఖల‌లో బలమైన ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఎత్తు అయితే.. వాటిని లైన్లో పెట్టడం మ‌రో కీల‌క అంశం. వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్ఠు ప‌ట్టించార‌ని చెబుతున్న పవన్ కళ్యాణ్.. వాటిని స‌రిదిద్దేందుకు.. ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో సినిమాలకు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఇప్పటికే ఆయన సినిమాలు స‌గంలో ఉన్న నేప‌థ్యంలో నిర్మాతల నుంచి అదేవిధంగా దర్శకుల నుంచి కూడా ఒత్తిడిలు పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు ఇటు శాఖలు, అటు సినిమాలు మేనేజ్ చేయడం కష్టమవుతుంద‌నే భావన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News