ఆరు నెలల్లో మా ప్రభుత్వం... పవన్ లెక్క పక్కా?

పవన్ ఉద్దేశ్యంలో మా ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన సర్కార్ అని అర్ధం అంటున్నారు.

Update: 2023-09-17 03:30 GMT

మరో ఆరు నెలలు మాత్రమే వైసీపీకి టైం ఉందని. ఆ తరువాత వచ్చేది తమ ప్రభుత్వమే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమాగా చెప్పేశారు. మేము అధికారంలోకి రాబోతున్నాం, ఇది పక్కా ఇది సత్యం అని అయన బల్లగుద్దారు.

ఏపీలో రాజకీయం మారిపోతోంది. ఆరే ఆరు నెలలలో ఏపీలో మా సర్కార్ వస్తోంది అని ఆయన అన్నారు. పవన్ ఉద్దేశ్యంలో మా ప్రభుత్వం అంటే టీడీపీ జనసేన సర్కార్ అని అర్ధం అంటున్నారు. నిన్నటికి నిన్న టీడీపీతో పొత్తు పెట్టుకుని వచ్చిన పవన్ లో ఇపుడు ఎక్కడ లేని హుషార్ కనిపిస్తోంది. నిజానికి ఈ పొత్తు విషయం చాలా కాలం క్రితమే నలుగుతున్నా ఎపుడు ఎక్కడ ప్రకటించాలి, ఎలా ముందుకు తీసుకేళ్లాలి అని ఏవేవో సందేహాలు ఉండేవి

వాటిని పటాపంచాలు చేసేలా చంద్రబాబు అరెస్ట్ జరిగింది. బలమైన పార్టీ పెద్ద పార్టీ అయిన టీడీపీ ఇపుడు సంక్షోభంలో పడిపోయింది. అధినాయకుడు జైలు గోడల మధ్య ఉన్నారు సరిగ్గా ఈ సమయాన్ని వ్యూహాత్మకంగా మలచుకున్నారు పవన్ అంటున్నారు మిత్రుడికి సాయం చేసినట్లుగానూ ఉంది, పొత్తు కుదిరినట్లుగానూ ఉంది అన్నట్లుగా రెండిందాలుగా లాభం తో పవన్ రాజమండ్రి జైలు ఆవరణలోనే క్షణం ఆలస్యం చేయకుండా పొత్తు ప్రకటన చేశారు.

నిజానికి మామూలుగా పరిస్థితి ఉంటే టీడీపీ జనసేనకు తాము అనుకున్న సీట్లే ఇచ్చి ఉండేది. ఒక వైపు చంద్రబాబు జిల్లా టూర్లు, మరో వైపు లోకేష్ పాదయాత్రతో టీడీపీలో జోష్ పెరిగింది. దాంతో పొత్తు ఉండాలని కోరుకున్నా జనసేన వైపు నుంచే నరుక్కి వచ్చి తక్కువ సీట్లతో సరిపెట్టాలన్న ఎత్తుగడతో టీడీపీ ఉంది అని ప్రచారం సాగింది.

అది భగ్నం అయింది. చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఇపుడు ఒక విధంగా గేమ్ చేంజర్ గా పవన్ నిలిచారు. అందుకే ఆయనలో ఎక్కడ లేని విశ్వాసం కనిపిస్తోంది. వచ్చిన ఛాన్స్ ని వదులుకోరాదని పవన్ ఏకంగా షూటింగ్స్ ని సైతం పక్కన పెట్టి మరీ సీరియస్ గానే పాలిటిక్స్ లోకి దిగిపోయారు. ఈ నెల 21 నుంచి ఆయన వారాహి యాత్ర మూడవ విడతకు రెడీ అవుతున్నారు.

అది కూడా క్రిష్ణా జిల్లాలోనే యాత్ర చేయబోతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ పొత్తు ప్రకటన, జైలుకు వెళ్ళి మరీ బాబుతో ములాఖత్ కావడం మీద కూడా వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది. సోషల్ మీడియాలో మీమ్స్ చేసి మరీ పెడుతోంది. అలాగే ట్రోల్స్ చేస్తోంది. దీనికి పవన్ మంగళగిరిలో జరిగిన పార్టీ మీటింగులో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

మీరు ఏమి అయినా చేసుకోండి, మీమ్స్ చేసుకోండి, ట్రోల్స్ చేసుకోండి, కానీ నేను మాత్రం ఆంధ్రాను సేవ్ చేసుకుంటాను అని పవన్ చెప్పడం విశేషం. ఇది నిజంగా వైసీపీకి గట్టి పంచ్ అని కూడా అంటున్నారు. వైసీపీ నేతలకు ఒక్కటే చెబుతున్నానని మీరు ఓడిపోతున్నారు అన్నదే తన మాట అని పవన్ టెరిఫిక్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. వచ్చేది మేమే అని చెప్పడమూ విశేషం. ఎన్నికలకు ఆరేడు నెలల ముందే పవన్ ఇంతలా ధీమాతో చెప్పడం అంటే ఏపీ రాజకీయాలను ఆయన ఒడిసి పట్టారా లేక అతి ధీమానా లేక ఇంకా తెర వెనక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది అయితే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News