కోనసీమపై టార్గెట్ పెట్టారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకంగా కోనసీమపై టార్గెట్ పెట్టినట్లున్నారు.

Update: 2023-12-29 14:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకంగా కోనసీమపై టార్గెట్ పెట్టినట్లున్నారు. అందుకనే కాకినాడలో మూడురోజుల క్యాంపు వేశారు. పర్యటనలో జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల నుండి నేతలను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి ఎలాగుంది ? రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయమై అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లోను పార్టీ పరిస్ధితిపై పవన్ ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించుకున్నారు.

ఆ సర్వే రిపోర్టుల ఆధారంగా ఇపుడు తూర్పుగోదావరి జిల్లాలోని నేతలతో సమీక్షలు మొదలుపెట్టారు. పోయిన ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లెన్ని, టీడీపీ-జనసేన అభ్యర్ధులకు వచ్చిన ఓట్ల లెక్కలపై మాట్లాడుతున్నారు. అప్పటికి ఇప్పటికి జనసేన బలపడిన విధానంపై నేతలతో చర్చలు జరుపుతున్నారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం కాకినాడ జిల్లాలోని రాజోలు, పీ గన్నవరం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసే అవకాశాలున్నాయి. మిగిలిన అమలాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో టీడీపీ పోటీచేస్తుంది.

అందుకనే జనసేన పోటీచేస్తుందని అనుకుంటున్న రాజోలు, పీ గన్నవరం, రామచంద్రాపురం నియోజకవర్గాలపై పవన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. రాజోలులో బొంతు రాజేశ్వరరావు, రామచంద్రాపురం నుండి పితాని బాలకృష్ణ లేదా చిక్కాల దొరబాబు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పీ గన్నవరం నుండి ఎన్ఆర్ఐ పెనుమాల జాన్ బాబు పోటీపై చాలా ఆశక్తి చూపతున్నారు. ఒకవేళ జాన్ బాబు కాకపోతే ఆయన భార్య దేవి పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో ఉంటూనే నియోజకవర్గంలో భార్యను ముందుపెట్టి పార్టీ కార్యక్రమాలను జాన్ బాబు నిర్వహిస్తున్నారు.

నిజానికి పై మూడు నియోజకవర్గాల్లో టీడీపీనే బలంగా ఉంది. కాకపోతే పొత్తు ధర్మం కారణంగా మూడు నియోజకవర్గాలను వదులుకోవటానికి చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే మూడింటిలో రెండు ఎస్సీ రిజర్వుడు ఒకటి ఓపెన్ నియోజకవర్గం కావటమే జనసేన నేతల్లో కొంత అసంతృప్తికి కారణమవుతోంది. ఏదేమైనా జనవరిలో అభ్యర్ధులను ప్రకటించేందుకు పవన్ రెడీ అవుతున్నారు. అందుకనే కాకినాడ జిల్లాలో క్యాంపేసి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నది.

Tags:    

Similar News