పాపం పవన్ : కులం...వ్యాకులం....!

కులం అన్నది ఒక భావన. అది భ్రాంతిగా భావించిన వారినీ వదలదు. మహా కవి శ్రీశ్రీది విశాఖ

Update: 2024-02-06 02:20 GMT

కులం అన్నది ఒక భావన. అది భ్రాంతిగా భావించిన వారినీ వదలదు. మహా కవి శ్రీశ్రీది విశాఖ. ఆయన విశాఖలో ఒక కార్యక్రమం కోసం డెబ్బై దశకంలో వస్తే ఆయన మా కులం వారే అని సొంత సామాజికవర్గం వారు తీసుకెళ్ళి హడావుడి చేశారని, తనకు కులం లేదన్న వినిపించుకోరేమి అని ప్రపంచ పౌరుడుగా ఉండాలనుకున్న శ్రీశ్రీయే మధన పడ్డారు.

ఆయన కవి. ఆయనకే కులం రంగు తప్పలేదు. ఈ రోజుకీ ఒక సామాజిక వర్గం వారు మా ప్రముఖులు అంటూ ఆయన ఫోటోను వేస్తూనే ఉంటారు. ఇక ఎవరు ఎంతటి వారు అయినా కమ్యూనిస్టు అయినా హేతు వాది అయినా కులం సంకెళ్ళను తెంచుకోలేరు. రాజకీయాల్లో అయితే కులం అన్నది ఒక పెద్ద క్రెడిట్. అది లేకపోతే నో పాలిటిక్స్ అన్నట్లుగా తయారు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను అందరి వాడిని తనకు కులం లేదని చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు. తాను రెల్లిని అన్నారు. మరోసారి తాను బీసీని అని కూడా అన్నారు. ఇలా పవన్ కులాలు వద్దు అని చెబుతున్నా ఆయనను కులం వీడదు. ఇక పవన్ కూడా 2019 ఎన్నికల్లో బీసీలకు ఇతర వర్గాలకు సీట్లు ఇచ్చినా ఆయనది కాపుల పార్టీ అనే ప్రచారం చేశారు.

ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కూడా కులం బలం ఉండాల్సిందే అని భావించారని అంటారు. అందుకే ఆయన వారాహి రధం తమ కులం జనాభా అధికంగా ఉన్న గోదావరి జిల్లాలలో దూసుకుని వెళ్లింది. పూర్తి సక్సెస్ అయింది. అప్పటికి పొత్తుల గొడవలు లేవు. పవనే సీఎం అని అంతా అనుకున్నారు. అలాగే పవన్ సభలను విజయవంతం చేశారు.

ఇక టీడీపీతో పొత్తు తరువాత కూడా పవనే సీఎం అని అంతా అనుకున్నారు. సీఎం పదవి విషయం ఎన్నికల తరువాత అని పవన్ కూడా చెబుతూ వచ్చారు. పొత్తులు ఎవరితో ఉన్నా మీ గౌరవాన్ని తగ్గించను గౌరవ ప్రదమైన సీట్లు అని కూడా ఊరించారు. ఇపుడు చూస్తే ఎల్లో మీడియాలో రాతలు ఒకలా ఉన్నాయి. జనసేనకు 20 సీట్లు మించి ఇవ్వరు అన్న ప్రచారం సాగుతోంది.

దీని మీద కాపు సంక్షేమ సేన అధ్యక్షుడి హోదాలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య మండిపడుతున్నారు. కాపులంతా మీ పైన ఆశలు పెట్టుకుంటే మీరు ఇలా తగ్గిపోవడం న్యాయమా పవనూ అంటూ ఆయన లేఖాస్త్రాలు సంధిస్తున్నారు మా ప్రశ్నకు బదులేది అని నిలదీస్తున్నారు.

నిజానికి పవన్ ఈ సమయంలో ఏమి చెబుతారు అన్నది ఆసక్తికరం. తనకు అన్ని కులాలు సమానమే అని ఆయన చెప్పవచ్చు. అపుడు కూడా కాపులు సహకరిస్తారా అన్నది బిగ్ క్వశ్చన్ గా ఉంటుంది. నేను అందరి వాడిని నాకు కులాలేమిటి అని కూడా చెప్పవచ్చు. అపుడు ఒక రాజకీయ పార్టీకి మూలధనంగా ఉంటే ఓటు బ్యాంక్ ఇబ్బందులో పడుతుంది.

నిజానికి చూస్తే టీడీపీకి కమ్మ పార్టీ అంటారు. వైసీపీని రెడ్ల పార్టీ అంటారు. అలాగని ఆయా పార్టీలను ఆ కులాల పెద్దలు బాహాటంగా డిమాండ్ చేసి ఇలాగే నడవాలని డైరెక్షన్ ఇవ్వరు. ఉంటే గింటే లోపాయికారిగా ఏమైనా ఉండొచ్చెమో. అందుకే జగన్ చంద్రబాబు అందరి వారు గా ఉంటున్నారు.

కానీ పవన్ మాత్రం అందరి వాడిని అంటున్నా ఒక కులం వారిగా మారిపోతున్నరా లేక మార్చేస్తున్నారా అన్నదే పెద్ద చర్చగా ఉంది. ఏది ఏమైనా పవన్ ఇపుడు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి. ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తే టీడీపీ ఇస్తుందో లేదో తెలియదు. తక్కువ అయితే కాపు సంఘాలు గుర్రుమీదన ఉన్నాయి. అందుకే జనసేనాని పవన్ కి ఈ కులం వ్యాకులం పట్టుకుంది అంటున్నారు.

Tags:    

Similar News