సీట్లు ఎన్ని అయితేనేమి...పవన్ అల్ప సంతోషేనా...!?

ఏకంగా 98 శాతం స్ట్రైకింగ్ రేటు ఉండాలని పవన్ దిశానిర్దేశం చేశారు. అంటే పొత్తులో ఇచ్చిన దాదాపు అన్ని సీట్లను గెలుచుకోవాలని ఆయన ఆరాటంగా కనిపిస్తోంది.

Update: 2024-02-05 04:16 GMT

సీట్లు ఎన్ని అయితేనేమి గెలుపు ముఖ్యం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయట పెట్టారు అని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎక్కువ సీట్లు తీసుకోవడం కాదు తీసుకున్న ప్రతీ సీటు గెలిపించుకోవాలి అన్నది పవన్ థియరీగా కనిపిస్తోంది. అందుకే ఆయన ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదు ఎన్ని గెలిచామన్నదే చూసుకోవాలంటూ క్యాడర్ కి హింట్ ఇచ్చేశారు.

తీసుకున్న ప్రతీ సీటు జనసేన పోటీ చేసిన ప్రతీ సీటు కచ్చితంగా గెలిచేలా క్యాడర్ శ్రద్ధ పెట్టి పనిచేయాలని పవన్ కోరారు. ఏకంగా 98 శాతం స్ట్రైకింగ్ రేటు ఉండాలని పవన్ దిశానిర్దేశం చేశారు. అంటే పొత్తులో ఇచ్చిన దాదాపు అన్ని సీట్లను గెలుచుకోవాలని ఆయన ఆరాటంగా కనిపిస్తోంది.

పొత్తులో జనసేనకు పాతిక నుంచి ముప్పయి సీట్లు ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. వాటిని అన్నింటినీ గెలుచుకోవాలని పవన్ గట్టిగా భావిస్తున్నారు. అంటే 2024 తరువాత ఏర్పడే చట్ట సభలో పాతిక ముప్పయి సీట్ల బలంతో జనసేన అడుగు పెడితే ఆ లెక్కే వేరు అన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది.

అదే విధంగా రేపటి అసెంబ్లీలో జనసేన ముఖ్య భూమిక పోషించాలంటే ఈ సీట్లే అత్యంత కీలకంగా మారుతాయని భావిస్తున్నారు. మొత్తానికి పవన్ అంటున్న మాటలను బట్టి చూస్తే టీడీపీ ఇచ్చే సీట్లను తీసుకుని వాటిలోనే గెలుపు ఆశలను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది అని అంటున్నారు.

ఇక ఆయన పొత్తుల గురించి చాలానే మాట్లాడారు. పొత్తులు అంటే ఎపుడూ సమస్యలు ఉంటాయని, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలతో కూడా సీట్ల సర్దుబాటు కష్టతరంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇక 2024 ఎన్నికల తరువాత ఏపీలో ఏర్పడేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని ఆయన అన్నారు. అయితే ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉందని అన్నారు.

జగన్ మాయలు మోసాలు అన్నింటినీ అధిగమించి నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని పవన్ దిశా నిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే ఉండవల్లిలో చంద్రబాబుతో జరిగిన భేటీలో పవన్ సీట్ల విషయంలో సర్దుబాటు చేసుకున్నారు. అయితే నంబర్ ఎంత అన్నది తొందర్లోనే తెలుస్తుంది అని అంటున్నారు.




 


Tags:    

Similar News