వారాహి యాత్రకు సర్వం సిద్ధం.. సైనికులకు దిశానిర్దేశం ఉండేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర మూడో విడతకు రంగం రెడీ అయింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర మూడో విడతకు రంగం రెడీ అయింది. ఇప్పటి వరకు రెండు దఫాలుగా ఈ యాత్ర సాగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించారు. ఈ రెండు యాత్రలు జోరుగా సాగినా.. జనసేన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, అభిమా నులకు కానీ... పవన్ ఎలాంటి దిశానిర్దేశం చేయలేదనే ఆరోపణలు వినిపించాయి. పైగా... వలంటీర్ల విషయా న్ని ప్రస్తావించి వివాదానికి తెరదీశారు.
అదేవిధంగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు దఫాలుగా సాగిన వారాహి యాత్ర కేవలం కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమైన దరిమిలా.. పార్టీ లక్ష్యం.. పార్టీ కార్యకర్తలకు చేసే దిశానిర్దేశం వంటి అనేక కీలక విషయాలు మాత్రం పక్కదారి పట్టాయి. దీంతో తాజాగా ఆదివారం(అక్టోబరు 1) నుంచి సాగనున్న వారాహి యాత్రపై అనేక అంచనాలు వస్తున్నాయి.
టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్.. దీనిపై ఏమేరకు స్పష్టత ఇస్తారు? సీట్లు, ఓట్లు, పదవులు అనే విషయాలను ఆయన ప్రస్తావిస్తారా? లేదా? అనేది కూడా కీలకంగా మారింది. ఇక, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సాగనున్న ఈయాత్ర ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ నియోజకవర్గం పెడన, మాజీ మంత్రి పేర్ని నాని నియోజకవర్గం మచిలీపట్నంలలో సాగనుంది. దీంతో ఈ యాత్రపై ఎనలేని ఉత్కంఠ నెలకొంది.
అయితే.. వారాహి యాత్ర ద్వారా పార్టీ శ్రేణులకు పవన్ ఏమేరకు దిశానిర్దేశం చేస్తారనేది కూడా ఆసక్తిగా నే మారింది. ఇప్పటి వరకు రెండు సార్లు యాత్ర జరిగినా.. కార్యకర్తలకు ఇతమిత్థంగా ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు. కానీ, ఇప్పుడు టీడీపీతో పొత్తు నేపథ్యంలో కార్యకర్తలకు ఏం చెబుతారు? పదవులు ఆశిస్తున్నవారిని, టికెట్లు ఆశిస్తున్నవారిని ఎలా బుజ్జగిస్తారు? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. కేవలం సర్కారుపై విమర్శలకే సరిపెడతారో.. తన పార్టీ భవితవ్యాన్ని ఆవిష్కరిస్తారో చూడాలి.