ఏపీలోనూ పెగాసస్ స్పైవేర్... జగన్ పై లోకేష్ సంచలన ఆరోపణలు!

ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందనే సంగతి తెలిసిందే

Update: 2024-06-10 11:17 GMT

ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నాడు అధికారంలో ఉన్న బీఆరెస్స్ ప్రభుత్వం పలువురు తమ పార్టీ నేతలతో పాటు విపక్ష నేతలు, అధికారులు, సినిమా హీరోయిన్ల ఫోన్ లను కూడా ట్యాప్ చేసినట్లు విచారణలో అధికారులు చెప్పారని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు లొకేష్.

అవును... ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించి ప్రతిపక్ష నేతల ఫోన్ లను ట్యాప్ చేసిందని, పదవీ విరమణకు ముందే ఆ సాక్ష్యాలను క్రమపద్ధతిలో నాశనం చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన ఫోన్ ను ట్యాప్ చేయించారంటూ టీడీపీ నేత, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు సంచలన ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన నారా లోకేష్... మార్చి 2023లో యువగళం యాత్ర సమయంలో ఒకసారి, ఈ ఏప్రిల్ లో ఎన్నికల ప్రచార సమయంలో ఓసారి.. ఇలా తన ఫోన్ ను రెండుసార్లు లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఆ సమయంలో తమ ఫోన్ లకు ఆపిల్ నుంచి హెచ్చరికలు అందాయని అన్నారు. ఈ విషయంలో తనవద్ద విచారణకు సరిపడా సమాచారం అయితే ఉందని వెల్లడించారు!

ఇదే సమయంలో... తమ ఫోన్ లను ట్యాప్ చేయడానికి జగన్ ప్రభుత్వం పెగాసస్ ను ఉపయోగించిందని తాము అనుమానిస్తున్నామని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అక్రమ స్పైవేర్ లను సంపాదించారని, నిఘాను కప్పిపుచ్చడానికి ఏపీ వెలుపల నుంచి ఆపరేట్ చేశారని ఆయన పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం కొలువుదీరగానే.. ఈ పెగాసస్ ను ఎలా కొనుగోలు చేశారు.. ఎక్కడ నుంచి నడిపించారు.. ఎవరెవరిని టార్గెట్ చేశారనే విషయాలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతామని లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News