ఏపీలో పెన్షన్ దారులకు కొత్త కష్టాలు... బ్యాంకుల వద్ద బాబుకి శాపనార్థాలు!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిన అనంతరం కొంతమంది చేసిన పనుల వల్ల పెన్షన్ దారులు కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నారనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిన అనంతరం కొంతమంది చేసిన పనుల వల్ల పెన్షన్ దారులు కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నారనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 58 నెలల పాటు ఇంటివద్ద కడుపులో చల్లగా కదలకుండా పెన్షన్ తీసుకున్న వృద్ధులు, వికలాంగులు... ఏప్రిల్ నెలలో నరకం చూసినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ నెలలో పెన్షన్స్ తీసుకోవడంలో ఇబ్బందులు పడి సుమారు 32 మంది వృద్ధులు మృతిచెందారనే విషయం తీవ్ర కలకలం రేపింది!
దీంతో... మే నెలలో కూడా ఈ సమస్యలు తప్పవా అనే ఆందోళన నాడు పలువురు వృద్ధులు వ్యక్తపరిచిన పరిస్థితి! ఈ సమయంలో ప్రభుత్వం ఉద్యోగులతో పెన్షన్స్ ఇంటింటింకీ పంపించాలని పలువురు ఉచిత సలహాలు ఇస్తూ డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నించారనే కామెంట్లు వినిపించాయి కూడా! ఆ సందర్భంగా జరిగిన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల సంగతి కాసేపు పక్కనపెడితే... మే నెల వచ్చేసింది.
అయితే... మే నెలలో బ్యాంక్ అకౌంట్స్ లో పెన్షన్ వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో... ఏప్రిల్ నెలలో పడిన ఇబ్బందులే తిరిగి రిపీట్ అయ్యాయని అంటున్నారు. కాకపోతే అప్పుడు గ్రామ/వార్డు సచివాలయాలు చుట్టు తిరగగా.. ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి! పైగా మే నెలలో ఎండలు పలుచోట్ల 40డిగ్రీల సెల్సియస్ దాటిందని అంటున్నారు! దీంతో పండుటాకులు విలవిల్లాడుతూ.. ఈ పరిస్థితికి కారణం చంద్రబాబే అంటూ శాపనార్థాలు పెడుతున్నారు.
అవును... ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ దారులకు కష్టాలు మే నెలలోనూ తప్పడం లేదు. గత నెలలో గ్రామ/వార్డు సచివాలయలు దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు.. ఈ నెలలో బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో మే 1వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు! దీంతో... బ్యాంకుల దగ్గర బారులు తీరిన వృద్ధులు, పెన్షన్ దారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!
ఈ క్రమంలో బ్యాంకుల వద్ద క్యూకట్టిన వృద్ధుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో క్యూల్లో నిల్చున్న వృద్ధులు... వారు పడుతున్న ప్రయాసలకు చంద్రబాబు & కో లే కారణం అని ఒకరికొకరు చెప్పుకుంటూ.. కారాలూ, మిరియాలూ నూరుతున్న పరిస్థితి. ఈ సందర్భంగా బ్యాంకుల వద్ద నిల్చుని అలసి, సొలసిన వృద్ధులు చంద్రబాబుకి శాపనార్థాలు పెడుతూ.. వాలంటీర్ వ్యవస్థను తలచుకుంటూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!
ఈ సందర్భంగా... వాలంటీర్ల తో ఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ అంటూ మండిపడుతున్నారు పెన్షన్ దారులు. నేడు తాము పడుతున్న ఈ ఇబ్బందులకు, ప్రయాసలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చంద్రబాబే కారణం అనే చర్చ బ్యాంకుల వద్ద ఉన్న క్యూ లైన్లలో జరుగుతుండటంతో... స్థానిక టీడీపీ నేతలు తలలు పట్టుకున్నట్లు తెలుస్తుంది.