సంచలనం: ఛార్జీలు విధిస్తే.. వదిలేయటానికి సిద్ధమనట

గతంలో చేతిలో ఉండే క్యాష్ తో కొనుగోలు చేసే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

Update: 2024-09-29 09:30 GMT

గతంలో చేతిలో ఉండే క్యాష్ తో కొనుగోలు చేసే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చేతిలో క్యాష్ అంతగా లేని పరిస్థితి. చెల్లింపుల కోసం ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఇక.. చిన్న చిన్న మొత్తాల్ని సైతం ఆన్ లైన్ వేదికగా చేసుకొని వాడుతున్న పరిస్థితి. ఇంతలా వాడుతున్న యూపీఐ మీద ఛార్జీలు విధిస్తే.. స్పందన ఎలా ఉంటుంది? వారెలా రియాక్టు అవుతారన్న దానికి నిదర్శనంగా ఒక సర్వేను నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న వారి నుంచి వచ్చిన ఫలితం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది తమ అభిప్రాయాల్ని వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. వారిలో కేవలం 22 శాతం మందే ఫీజు చెల్లించేందుకు సుముఖత వ్యక్తమైంది. సర్వే ప్రకారం 38 శాతం మంది యూజర్లు తమ చెల్లింపుల్లో 50 శాతం లావాదేవీలకు డెబిట్.. క్రెడిట్ లేదంటే ఇతర డిజిటల్ విధానాలు కాకుండా యూపీఐనే ఉపయోగిస్తున్నట్లు తేలింది.

జులై రెండో వారం నుంచి సెప్టెంబరు మూడో వారం మధ్య నిర్వహించిన సర్వేలోని ప్రశ్నలకు 42వేల మంది సమాధానాలు ఇచ్చారు. మొత్తం 308 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీల అంశానికి పదిహేనువేలకు పైనే సమాధానాలు వచ్చినట్లుగా పేర్కొన్నారు. వీరిలో అత్యధికులు ఛార్జీలకు సుముఖంగా లేరు. అంతేకాదు.. ఛార్జీల్ని విధించటమే లక్ష్యమైతే.. యూపీఐ చెల్లింపుల్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం. 2023-24లో యూపీఐ లావాదేవీలు 57 శాతం పెరిగాయి. మొత్తం చెల్లింపులు తొలిసారి 100 బిలియన్లు దాటి 131 బిలియన్లకు చేరుకున్నట్లుగా వెల్లడించారు. ఈ చెల్లింపుల మొత్తాన్ని రూపాయిల్లో చూస్తే రూ.199.89 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News