నీ ఆస్పత్రిలో భజన చేసుకో.. ఆమెపై పేర్ని సంచలన వ్యాఖ్యలు!

తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల పవిత్రతను చెడగొడుతున్న చంద్రబాబును శిక్షించాలని పూజలు చేశారు.

Update: 2024-09-29 11:22 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువులు కలిపారనే ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు వ్యవహార శైలిని నిరసిస్తూ సెప్టెంబర్‌ 28న వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ తిరుమల పవిత్రతను చెడగొడుతున్న చంద్రబాబును శిక్షించాలని పూజలు చేశారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత, ప్రముఖ ఆస్పత్రి అధినేత మాధవీ లతపై నిప్పులు చెరిగారు. కొద్ది రోజుల క్రితం ఆమె హైదరాబాద్‌ నుంచి వందే భారత్‌ రైలులో భజన చేస్తూ తిరుమలకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ తోపాటు వైసీపీ నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మాధవీలతపై పేర్ని నాని విరుచుకుపడ్డారు.

మాధవీలత ఆమె ఆస్పత్రిలో భజన చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా టైమ్‌ లో ప్రజలను ఆమె ఆస్పత్రి దోచుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు హిందువుల మీద ప్రేమ ఒలకబోస్తున్న ఆమె ఒక్క హిందువుకయినా ఆమెకు చెందిన ఆస్పత్రిలో తగ్గించి తీసుకున్నారా అని నిలదీశారు. పక్క రాష్ట్రంలో ఉండేవారికి ఆంధ్రా రాజకీయాలు ఎందుకని దుయ్యబట్టారు.

టీడీపీ నేతలు తెలంగాణ బీజేపీ నేతల్ని తీసుకొచ్చి మరీ తమపై విమర్శలు, నిరసనలు చేయిస్తున్నారని పేర్ని నాని నిప్పులు చెరిగారు. తెలంగాణ నుంచి బీజేపీ నేత ఒకావిడ భజన చేసుకుంటూ వచ్చేసిందని, ఇదంతా దిక్కుమాలినతనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేతనైనే నీ ఆస్పత్రిలో భజన చేసుకోవాలని పేర్ని.. మాధవీలతపై మండిపడ్డారు. కరోనా సమయంలో మీ ఆస్పత్రిలో ఒక్క హిందువుకయినా పైసా తగ్గించారా అని నిలదీశారు. మీ ఆస్పత్రి బాగోతాలు తమకు తెలియదని అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్కడో ఓవైసీ ఆస్పత్రిలో తగ్గించలేదని ఆమె అడుగుతోందని.. ముందు ఆమె తన ఆస్పత్రిలో హిందువులకు బిల్లు తగ్గించారా అని పేర్ని నాని నిలదీశారు. గతంలో అన్య మతస్తుడయిన ఏపీ గవర్నర్‌ .. ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ఆయనను ప్రశ్నించలేదని నిలదీశారు. అన్య మతస్తుడిని డిక్లరేషన్‌ ఇవ్వకుండా తిరుమలకు ఎందుకు తీసుకెళ్లారని మోడీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఈ రాష్ట్రం కాని వాళ్లు పక్క రాష్ట్రంలో బతుకుతూ హిందువుల గురించి, గుడి గురించి, మతం గురించి మాట్లాడతారా అని నిప్పులు చెరిగారు.

Tags:    

Similar News