చంద్రబాబు ఒక్కరే వద్దన్నారు పేర్ని నాని సంచలన ప్రెస్ మీట్

ఈ కేసులో తన సతీమణి పేర్ని జయసుధను అరెస్టు చేస్తామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించలేన్న విషయాన్ని ఈ సందర్భంగా పేర్ని నాని బయటపెట్టారు.

Update: 2024-12-28 11:57 GMT

రేషన్ బియ్యం కేసులో తనను ఇరికించేలా ఓ మంత్రి ప్రయత్నిస్తున్నారని, మేనేజర్ ను అరెస్టు చేసి ఆయనతో బలవంతంగా నా పేరు, నా కుమారుడు కిట్టు పేరు చెప్పించాలని ప్లాన్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తన సతీమణి పేర్ని జయసుధను అరెస్టు చేస్తామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా పేర్ని నాని బయటపెట్టారు.

మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గొడౌన్లను పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ గొడౌన్లలో రెండు కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం మాయమైందని ప్రభుత్వం కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. దీంతో గత 20 రోజులుగా ఆమె అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. భార్యతోపాటే మాజీ మంత్రి నాని కూడా గత కొద్ది రోజులుగా బయటకు రాలేదు. అయితే ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తున్న నాని... తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తూ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.

గొడౌన్ అద్దెకిస్తే డబ్బు వస్తుందనే ఆశతోనే పౌరసరఫరాల శాఖతో ఒప్పందం చేసుకున్నామని, అంతకుమించి వేరే నేరాలు, ఘోరాలు ఏమీ చేయలేదని, అయినా తమ గొడౌన్ లో బియ్యం తగ్గినట్లు చెబుతున్నందున, రూ.1.70 కోట్ల డబ్బును ప్రభుత్వానికి చెల్లించేందుకు ముందుకు వచ్చామని పేర్ని నాని చెప్పారు. తాము ఏ తప్పూ చేయకపోయినా ఏదో క్రిమినల్ పనులు చేసినట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను గతంలో మంత్రిగా పనిచేశానని, తాను ఎలాంటి వాడినో పోలీసులకు, మాజీ డీజీపీకి తెలుసనని చెప్పిన పేర్ని, డబ్బు కోసం తాను ఎవరైనా ఇబ్బంది పెట్టానా అని ప్రశ్నించారు. నా మీద కక్షతో ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెట్టేలా చూస్తున్నారని, తన భార్యకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని, పీపీలను మారుస్తూ ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేయాలంటే చేసుకోవచ్చని, ఆడవాళ్లను మాత్రం ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదని అన్నారు.

నేనే తప్పు చేస్తే ఐదు నెలలు ఏం చేశారని నిలదీసిన మాజీ మంత్రి పేర్ని నాని.. దయచేసి అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే మూడు శాతం కమీషన్ తీసుకున్న వారే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మంత్రిగా ఉంటూ ఆ శాఖల్లో ఉద్యోగుల బదిలీల కోసం డబ్బు తిన్నవారు తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే రాశారన్నారు. నేను మంత్రిగా ఎవరి వద్దైనా రూపాయి తీసుకున్నానని నిరూపించాలని సవాల్ విసిరారు.

తాను ఐదు వేల కోట్లు సంపాదించానని, మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయని ఎన్నికల ముందు ప్రచారం చేశారని, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు తన ఐదు వేల కోట్ల ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. తనకు మైనింగ్ ఉంటే సీజ్ చేయొచ్చు కదా? అని నిలదీశారు. తనతో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారని, పేర్ని నానిని ఒక్కరోజైనా జైల్లో వేయకపోతే తమ పార్టీ వారు ఒప్పుకునేలా లేరని చెప్పారని తెలిపారు. తనపై కక్షతో తన భార్యను ఇబ్బంది పెట్టొద్దని వేడుకున్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు ఆమె వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారాలు చేశారని, ఇప్పుడు తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఎంతో మాట్లాడాలని ఉన్నా, తన వల్ల తన భార్యకు ఇబ్బంది పెట్టకూడదని ఎక్కువగా ఏమీ మాట్లాడలేదని చెప్పారు. రాజకీయాల్లో నికార్సుగా బతికిన పేర్ని నాని డబ్బు కోసం దిగజారుడు రాజకీయాలు చేయడని చెప్పారు.

Tags:    

Similar News