పిన్నెల్లి మరో చింతమనేని కానున్నారా..?
చివరికి హైకోర్టు జోక్యంతో అన్ని కేసులు కలిపి ఒకే కేసుగా పరిగణిస్తూ బెయిల్ ఇస్తే తప్ప ఆయన బయటకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చిన వెను వెంటనే మళ్లీ అరెస్ట్ చేయనున్నారా? అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దెందులూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను అనేక కేసుల్లో కోర్టుకు హాజరు పరచడం, జైలుకు తీసుకువెళ్లడం కామన్ అయిపోయింది. ఆయన కేసులకు సంబంధించి బెయిల్ రావడం మళ్ళీ వేరే కేసు పెట్టడం.. ఆ కేసులో ఆయనను జైలుకు పంపించడం జరిగాయి. ఇలా `జైల్ టు బెయిల్` అన్నట్టుగా చింతమనేని ప్రభాకర్ సుమారు ఆరు మాసాల పాటు కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది.
చివరికి హైకోర్టు జోక్యంతో అన్ని కేసులు కలిపి ఒకే కేసుగా పరిగణిస్తూ బెయిల్ ఇస్తే తప్ప ఆయన బయటకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విషయం చూస్తే ఆయన పరిస్థితి కూడా ఇట్లానే ఉందని వైసిపి నాయకులు అంచనా వేస్తున్నారు. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో తొలుత ఆయనపై కేసు నమోదు అయింది. దీంతో ఆయన కొన్నాళ్లు రాష్ట్రం నుంచి దూరంగా ఉండటం తర్వాత హైకోర్టు ముందస్తు బెయిలు ఇవ్వడంతో రాష్ట్రానికి రావడం తెలిసిందే.
ఆ తర్వాత ఆయనపై సీఐ నారాయణ స్వామి అదేవిధంగా టిడిపి పోలింగ్ బూత్ ఏజెంట్ శేషగిరి ఫిర్యాదుతో హత్యయత్నం కేసుల నమోదు చేశారు. దీనికితోడు ముందస్తు బెయిల్ రద్దు కావడం.. ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ముందస్తు బెయిల్ రద్దు విషయంపై కోర్టుకు వెళ్లేందుకు వైసిపి నాయకులు సిద్ధంగా ఉన్నారు. హైకోర్టు రద్దు చేసిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేయటమో.. లేకపోతే మరో రూపంలో హైకోర్టుని ఆశ్రయించడమో చేయాలని చూస్తున్నారు. ఈ విషయంపై వైసిపి అధిష్టానం దృష్టి పెట్టింది.
రెండు రోజుల కిందట నెల్లూరు జైల్లో పిన్నెల్లిని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఆయనను అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టారు. అదేవిధంగా రామకృష్ణారెడ్డి మంచి వాడని, ప్రజా సేవకుడని కొనియాడని విషయం తెలిసిందే. బెయిల్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం మరిన్ని కేసుల్లో ఊపిరాడకుండా చేసే దిశగా ప్రయత్నాలు చేయటం కీలక పరిణామం. ఆయనపై స్థానికంగా మరో రెండు మూడు కేసులు ఉన్నాయి. మహిళను దూషించటం అదేవిధంగా కానిస్టేబుల్ మీద దాడి వంటివి పెండింగులో ఉన్నారు.
దీంతో ఈ కేసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా చింతమనేని ప్రభాకర్ మాదిరిగా మారుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుస కేసులతో బెయిల్ వచ్చినా ప్రభాకర్‌ను జైలుకు పంపించారు. ఇప్పుడు ఇదే పరిస్థితి పిన్నెల్లికి కూడా ఉంటుందా అనేది వైసిపి లో చర్చనీయాంశంగా ఉండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.