పిఠాపురంలో పవన్ కు శాపనార్థాలు... టీడీపీ కేడర్ నిప్పులు!

అవును... రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరం, గాజువాకల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని.. ఓడిన చోటే గెలిచి చూపిస్తారని చాలామంది భావించారు

Update: 2024-03-14 12:42 GMT

చాలా రోజుల సస్పెన్స్ తర్వాత తాను పోటీ చేసే స్థానంపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని ఖాయం చేసినట్లు ప్రకటించారు. అలా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించారో లేదో.. పిఠాపురంలో మంటలు చేలరేగాయి! టీడీపీ కార్యకర్తలు నిప్పులు చెరిగారు. దీంతో రాజకీయ వాతావారణం ఒక్కసారిగా వేడెక్కింది.

అవును... రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరం, గాజువాకల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారని.. ఓడిన చోటే గెలిచి చూపిస్తారని చాలామంది భావించారు. అలా కానిపక్షంలో మరింత సేఫ్ జోన్ గా భావించి తిరుపతి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే... భీమవరం టిక్కెట్ ను టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఇచ్చిన పవన్.. గాజువాకను టీడీపీకి వదిలేశారు. ఈ సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ ఒక్క ప్రకటన ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ లో మంట పుట్టించింది. దీంతో టీడీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ ల ఫ్లెక్సీలు చింపేశారు. పార్టీ కరపత్రాలు దగ్దం చేశారు. ఈ సందర్భంగా.. మహిళలు పెద్ద ఎత్తున పవన్ కు శాపనార్థాలు పెట్టారు.. బూతులు తిడుతూ నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఎలా గెలుస్తారో చూస్తామంటూ శపథం చేశారు.

"భీమవరంలో పోటీ చేసి ఓడిపోయాడు, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు.. అక్కడ గెలిచి రమ్మనమను.. అది మగతనమంటే" అని ఒక మహిళ అంటే... రాయలేని స్థాయిలో మరికొంతమంది వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున చేరిన టీడీపీ కార్యకర్తలు... పిఠాపురంలో పవన్ కల్యాణ్ ని గెలవనివ్వమని శపథం చేస్తూ... తీవ్రస్థాయిలో శాపనార్థాలు పెట్టారు.

ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ వర్సెస్ పవన్ కల్యాణ్!:

పిఠాపురంలో టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకు స్థానికంగా మంచి పేరు, పలుకుబడి ఉంది. ఈ క్రమంలోనే 2009లో టీడీపీ నుంచి పోటీచేసి కేవలం 1,036 ఓట్ల తేడాతో ఓటమిపాలైన ఆయన... 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీచేసి 97,511 ఓట్లు సాధించి 47,080 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో 2019లో టీడీపీ వర్మకు పిలిచి టిక్కెట్ ఇచ్చింది.

ఇదే క్రమంలో 2014 తరహాలో వర్మ మరోసారి ఇండిపెండెంట్ గా వేస్తే... పవన్ కు మరోసారి ఓటమి తప్పకపోవచ్చనే చర్చ ఇప్పటికే పిఠాపురంలో మొదలైపోయింది. అక్కడున్న టీడీపీ - జనసేన ఓట్లు కలిస్తేనే గెలుపుపై ధీమా అంతంతమాత్రం అంటున్న నేపథ్యంలో... వర్మ ఎదురుతిరిగితే పవన్ పని శంకరగిరి మాన్యాలే అని అంటున్నారు పరిశీలకులు.

పార్టీ అధినేత పరిస్థితే ఇలా ఉంటే...?:

పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించింది పక్క పార్టీ అభ్యర్థి కాదు.. స్వయానా మిత్రపక్షంలో ఉన్న పార్టీ అధినేత. ఈ నేపథ్యంలో... పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని ప్రకటిస్తేనే టీడీపీ క్యాడర్ ఇలా రియాక్ట్ అయ్యిందంటే... ఇక మిగిలిన 20 నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతుందనేది ఎవరి ఊహకు వారికి వదిలేయాల్సిన పరిస్థితి!

దీంతో... పొత్తులో భాగంగా... టీడీపీ - జనసేనల ఓట్ల ట్రాన్స్ ఫర్ అంత ఈజీ కాదని, అది ఆల్ మోస్ట్ అసాధ్యం అనే భావించాలని చెబుతున్నారు విశ్లేషకులు. మరోపక్క పవన్ కల్యాణ్ ను చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలే ఓడిస్తారంటూ జోస్యం చెప్పిన వైసీపీ నేతల మాటలనూ గుర్తుచేసుకుంటున్నారు.

Tags:    

Similar News