జల సంఘం వెనకడుగు!.. పోలవరం పనులపై అయోమయం?

ఏపీ జీవనాడి పోలవరం పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా మారుతున్నాయి.

Update: 2025-01-20 06:30 GMT

ఏపీ జీవనాడి పోలవరం పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా మారుతున్నాయి. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రంవాల్ నిర్మాణానికి ఇటీవల ఓకే చెప్పిన కేంద్ర జల సంఘం రెండు రోజుల్లోనే తన మనసు మార్చుకుంది. నిర్మాణ సంస్థ బావర్ ప్రతిపాదించిన టీ-5 ప్లాస్టిక్ మిశ్రమాన్ని వాడొద్దని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతర్జాతీయ నిపుణులు ప్రతిపాదించిన టీ-16 మిశ్రమంపైనా కేంద్ర జల సంఘం సందిగ్ధావస్థేనే ఎదుర్కొంటోంది. దీంతో డయాఫ్రంవాల్ నిర్మాణానికి ఏ కాంక్రీటు వాడాలనే విషయమై అయోమయ పరిస్థితి నెలకొంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించారు.

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్ నిర్మాణంపై కేంద్ర జల సంఘానికి స్పష్టత కొరవడింది. ఈ పనుల కోసం టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించవచ్చని గత శుక్రవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన జలసంఘం ఆదివారం నాటికి మనసు మార్చుకుంది. టీ-5 మిశ్రమం వాడాక భవిష్యత్తులో ప్రాజెక్టు భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారనే అనుమానంతో టీ-5 మిశ్రమం వాడొద్దంటూ లేఖ రాసింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. విదేశీ ఇంజనీర్లను రప్పించి పోలవరం ప్రాజెక్టుపై సలహాలివ్వాలని కోరారు. ఈ మేరకు అమెరికా, కెనడా నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు టీ-16 ప్లాస్టిక్ కాంక్రీటుతో డయాఫ్రంవాల్ నిర్మించాలని సూచించారు. అయితే డయాఫ్రంవాల్ నిర్మాణంలో వారికి అనుభవం లేదని భావించిన కేంద్ర జల సంఘం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ నియమించిన బావర్ ప్రతిపాదించిన టీ-5 ప్లాస్టిక్ మిశ్రమం వాడాలని ముందు సలహా ఇచ్చింది. దీంతో శనివారం పోలవరం పనులు ప్రారంభమయ్యాయి. అయితే 24 గంటల్లోనే మనసు మార్చుకున్న కేంద్ర జల సంఘం అధికారులు శనివారం రాత్రి టీ-5 మిశ్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.

కేంద్ర జల సంఘం సందిగ్ధవాస్థతో ప్రాజెక్టు పనులను అయోమయానికి గురిచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవుతోంది. దీనిపై నేరుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ద్వారా రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విషయం చేరవేశారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తర్వాత జల సంఘం అభ్యంతరాలను సీఎం ద్రుష్టికి తీసుకువెళ్లాలని మంత్రి రామానాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. దీనిపై దావోస్ పర్యటనలోనే ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

అయితే, కేంద్ర జల సంఘం నిర్ణయమేదైనా పోలవరం పనులు మాత్రం ఆపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. టీ-5 వద్దంటే టీ-16 మిశ్రమంతోనైనా పనులు చేస్తామని డయాఫ్రంవాల్ నిర్మాణ సంస్థ బావర్ చెబుతోంది. దీంతో ప్రాజెక్టు పనులపై జల సంఘం ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. పనులు మాత్రం ఆపే ప్రసక్తి లేదని చెబుతోంది. అయితే, పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుండటం వల్ల కేంద్ర జల సంఘం సూచనలు, సలహాలు కీలకంగా మారాయి. జల సంఘం కొర్రీలు వేస్తే భవిష్యత్తులో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News