అప్పుడు దేవత.. ఇప్పుడు బలిదేవతను చేశారు

మరో పోస్టర్ లో రాహుల్ గాంధీని ''ముద్దపప్పుకు స్వాగతం'' పేరుతో రేవంత్ ఆహ్వానిస్తున్నట్లుగా పోస్టర్లను సిద్దం చేసి.. అతికించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

Update: 2023-09-17 04:56 GMT

రాజకీయాలు అంతే. అప్పటివరకు అందలం ఎక్కించినోళ్లే.. బలిపీఠం మీదకు తెచ్చేస్తుంటారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే ధోరణి మొదట్నించి ఉన్నా.. ఇటీవల కాలంలో హద్దులు దాటుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా అన్నట్లుగా వ్యవహరించే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశ వేళ.. హైదరాబాద్ మహానగరానికి వచ్చిన కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీని బద్నాం చేసిన వైనం షాకింగ్ గా మారింది.


రాజకీయంగా ఎంత తేడా ఉన్నప్పటికీ.. కొన్ని విషయాల్లో కొందరిని అనకూడని మాటల్ని అనేసేందుకు వెనుకాడని తీరు చూస్తే.. రాజకీయం ఎంత కర్కశంగా ఉంటుందన్న భావన కలుగక మానదు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. మరో నెలలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సిన వేళలో.. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన సోనియాను.. 'బలిదేవత'గా పేర్కొంటూ నగరంలోని పలుచోట్ల పోస్టర్లు వెలిసిన తీరు దిగ్భాంత్రికి గురి చేస్తోంది.


అది కూడా.. టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతున్నట్లుగా సిద్ధంచేసిన పోస్టర్లు చూస్తే.. మరీ ఇంత బరితెగింపా? అనుకోకుండా ఉండలేం. నగరంలోని పలుచోట్ల సోనియాగాంధీ భారీ ఫోటో కింద ''బలిదేవతకు స్వాగతం'' అంటూ.. కిందన రేవంత్ రెండు చేతులు జోడించి.. నమస్కరిస్తున్న రేవంత్ ఫోటో పెట్టిన పోస్టర్లు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి. మరో పోస్టర్ లో రాహుల్ గాంధీని ''ముద్దపప్పుకు స్వాగతం'' పేరుతో రేవంత్ ఆహ్వానిస్తున్నట్లుగా పోస్టర్లను సిద్దం చేసి.. అతికించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎవరెన్ని చెప్పినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కర్త.. కర్మ.. క్రియ మొత్తం సోనియానే. ఆమె లేకుంటే ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారం అయ్యేది కాదు. ఆమెను తెలంగాణ దేవతగా గులాబీ బాస్ కేసీఆర్ సైతం కీర్తించటం మర్చిపోకూడదు. అలాంటిది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు దేవతగా ఉన్న సోనియా దెయ్యంగా పేర్కొంటూ పోస్టర్లు వేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

ఈ తరహా పోస్టర్లు అతికించిన వారిని.. వాటిని తయారు చేసిన వారిపై ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకుంటారో చూడాలి. నిజంగానే.. వీరిని పట్టుకోవాలన్నదే పోలీసుల ప్రయత్నం అయితే.. సీసీ కెమేరా ఫుటేజ్ లో గంటల వ్యవధిలో పట్టుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News