ప్రశాంత్‌ కిశోర్‌ కొత్త రాజకీయ పార్టీ విశేషాలు ఇవే!

ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహాలకు 2019లో వైసీపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది.

Update: 2024-09-30 05:02 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ను ముఖ్యమంత్రిని చేయడంలో, వైసీపీ 151 స్థానాలతో తిరుగులేని విజయం సాధించడంలో ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్‌ దే ప్రధాన పాత్ర అనే విషయం తెలిసిందే.

ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహాలకు 2019లో వైసీపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. అయితే సొంత పార్టీ ఏర్పాటుతో ఆయన ఐప్యాక్‌ నుంచి వైదొలిగారు. దీంతో రిషిరాజ్‌ ఐప్యాక్‌ ను నడిపించాడు. ఆయన ఆధ్వర్యంలోనే వైసీపీ ఐప్యాక్‌ సేవలను పొందింది.

2019లో తనకు ఘనవిజయాన్ని కట్టబెట్టేలా చేయడంతో అధికారంలోకి వచ్చాక కూడా వైఎస్‌ జగన్‌ ఐప్యాక్‌ ను కొనసాగించారు. అంతేకాకుండా 2024 ఎన్నికలకు కూడా ఐప్యాక్‌ సేవలనే పొందారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని.. ఫలితాలను ముందుగానే ప్రశాంత్‌ కిశోర్‌ కుండబద్దలు కొట్టారు. కేవలం సంక్షేమ పథకాల వల్లే ఓట్లు రావని.. ప్రజలు సంక్షేమంతో కూడిన అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

ప్రశాంత్‌ కిశోర్‌ మాటలను ఎన్నికల ముందు వైసీపీ నేతలు ఖండించారు. ఆయనపై పోటీలు పడి తీవ్ర విమర్శలు చేశారు. పీకే ఔట్‌ డేటెడ్‌ అని, ఆయన వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదని, తాము రిషి ఆధ్వర్యంలో ఐప్యాక్‌ తో నడుస్తున్నామని చెప్పారు. అయితే.. ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పినట్టే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది.

కాగా అక్టోబరు 2న కొత్త రాజకీయ పార్టీ పేరు, నాయకత్వం సహా ఇతర వివరాలను ప్రకటిస్తామని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తెలిపారు. పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదని స్పష్టత నిచ్చారు. ప్రజలే నాయకత్వ బాధ్యతలను చేపట్టాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం తాను చేపట్టిన ‘జన్‌ సురాజ్‌’ యాత్రనే రాజకీయ పార్టీగా మలచనున్నట్లు ఇటీవల ఆయన వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తన సొంత రాష్ట్రం బీహార్‌ లో ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. పదవీ విరమణ చేసిన నలుగురు మాజీ ఉన్నతాధికారులు బీహార్‌ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చెప్పినట్టల్లా ముఖ్యమంత్రి నితీశ్‌ నడుచుకుంటారని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News