అస్థిర, కల్లోల లంకలో వామపక్ష గాలి.. చరిత్రలో తొలిసారి..
సరిగ్గా రెండేళ్ల కిందట శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరూ చూశారు.
సరిగ్గా రెండేళ్ల కిందట శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరూ చూశారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో సాక్షాత్తు దేశాధినేతనే పారిపోయే పరిస్థితి వచ్చింది. సాధారణ పౌరులు అధ్యక్షుడి నివాసంలోకి ప్రవేశించి ఇష్టారీతిన వ్యవహరించారు. అధ్యక్షుడి పాలనపై తమకు ఉన్న ఆగ్రహాన్ని చాటిచెప్పారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అలాంటి దేశంలో ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, చరిత్రలో లేనంతగా మలుపులు చోటుచేసుకుంటున్నాయి.
ఫలితంపై తీవ్ర ఉత్కంఠ!
బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ తర్వాత ఉప ఖండంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న దేశం శ్రీలంక. అయితే, అక్కడ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ అభ్యర్థికైనా విజయానికి 50 శాతం పైగా ఓట్లు అవసరం. అవి ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. గెలుపును రెండో రౌండ్ కౌంటింగ్ నిర్ధరించనుంది.
దిశనాయకే..
లంకలో ఇప్పటివరకు ప్రేమదాసలు, రాజపక్సల పాలన చూశారు. కానీ, ఈ సారి గాలి వామపక్షాల వైపు మళ్లింది. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నాయకుడు, నేషనల్ పీపుల్స్ పవర్ అభ్యర్థి అనుర కుమార దిసనాయకే దూసుకెళ్తున్నారు. ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీపడినా మొదటి నుంచి మొగ్గు ఈయన వైపే ఉంది. దిసనాయకే ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. మొదటి రౌండ్ లోనే దిసనాయకే 39.52 శాతం ఓట్లు సాధించారు. ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస 34.28 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ టాప్-2లో ఉన్నప్పటికీ విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లను ఎవరూ సాధించలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి ఇద్దరు అభ్యర్థుల ఓట్లకు జోడించి.. వీటిలో అత్యధిక మెజార్టీ వచ్చిన వారిని విజేతగా ప్రకటించనున్నారు.
ముగ్గురి మధ్యన..
లంక అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఓటర్లు ప్రాధాన్య క్రమంలో ముగ్గురికి ఓటు వేశారు. రెండో రౌండ్ లోనూ ఎవరికీ ఆధిక్యం రాకుంటే.. మూడో రౌండ్ ప్రాధాన్య ఓట్లను లెక్కించి విజేతను నిర్ణయిస్తారు. కాగా, లంక అధ్యక్ష ఎన్నికల్లో రెండో రౌండ్ లెక్కించాల్సిన అవసరం ఇప్పుడే మొదటిసారి. ఇప్పటివరకు మొదటి ప్రాధాన్య ఓట్ల సమయంలోనే విజేతలు ఖరారయ్యారు. అయితే, విశ్లేషకులు దిసనాయకేకే ఓటేస్తున్నారు. మరి లంకకు కొత్త దిశ చూపే నాయకుడు అయనో కాదో చూడాలి.