తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో మొదలై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
ఏపీలో మొదలై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం భారత సమాజంలో అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇప్పటికే రాజకీయ రంగు పులుముకున్న ఈ వ్యవహారం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ స్పందించారు.
అవును... తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయం స్పందించారు. ఇందులో భాగంగా... తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో... తిరుమల బాలాజీ భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడని, ఆ దేవుడి లడ్డూ ప్రసాదం కల్తీ అనే అంశం ప్రతీ భక్తుడికీ ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలని తెలిపారు.
ఈ మేరకు రాహుల్ గాందీ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కింద కామెంట్ సెక్షన్ లో బీజేపీ అభిమానులు, హిందుత్వ వాదులు కీలకంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటం వెనుక పరమార్ధం తమకు అర్ధం కావడం లేదని అంటున్నారు. ఈ విషయంలో రాహుల్ చాలా బెటరని నొక్కి చెబుతున్నారు!
ఇది భారతదేశంలో అత్యంత ప్రాధాన్యమైన విషయమని.. ఈ వ్యవహారంపై బీజేపీ అగ్రనేతల మౌనం భక్తులను మరింత ఆందోళనకు గురి చేస్తుందని చెబుతున్నారు. మరోపక్క... తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబుని కేంద్రం నివేదిక కోరినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా... ఈ వ్యవహారంపై ఓ నిర్ధిష్టమైన వాస్తవ ముగింపు మాత్రం ప్రతీ భక్తుడూ కోరుకుంటున్నారనే చెప్పాలి!