మోడీ 3.0 లో కొత్తదనం లేదా ?

కొత్త ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా ఎవరికీ తెలియడం లేదని పెదవి విరుస్తున్నారు.

Update: 2024-07-04 17:30 GMT

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ఈసారి ఎలా పాలిస్తారు ఏమి చేయబోతున్నారు అన్న దాని మీద అంతా చూస్తున్నారు. అయితే కొత్త లోక్ సభలో మోడీ స్పీచ్ విన్న తరువాత కొత్తదనం ఏమీ లేదని తేలిపోయింది అని అంటున్నారు. కొత్త ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా ఎవరికీ తెలియడం లేదని పెదవి విరుస్తున్నారు.

మోడీ గత రెండు సార్లూ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన అత్యంత శక్తిమంతుడిగా నిలిచారు. కానీ ఈసారి చూస్తే అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించలేదు. 18వ లోక్ సభలో చూస్తే విపక్ష శిబిరంలో పూర్తి ఆత్మ విశ్వాసం తొణికిసలాడితే అధికార పక్షం మాత్రం ఆత్మ రక్షణలో పడినట్లుగా సన్నివేశాలు కనిపించాయి.

మూడోసారి ప్రధాని అయ్యాక మోడీ లోక్ సభలో పూర్తిగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అది ఆయనకు కొత్త అనుభవం గానే ఉంది. మోడీ తన మొత్తం రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి బహుశా ఎదుర్కొని ఉండరని అంటున్నారు. ఆయన పదమూడేళ్ళ పాటు గుజరాత్ సీఎం గా పనిచేసినా అక్కడ నామమాత్రం ప్రతిపక్షమే ఉంది. అంతే కాదు రెండు సార్లు కేంద్రంలో ప్రధానిగా ఉన్నా ప్రతిపక్షం పెద్దగా బలం లేకుండా ఉంది.

అలాంటిది ఫస్ట్ టైం విపక్షం ఎంత బలంగా ఉందో ఆయన చూస్తున్నారు. దాని వల్ల అధికార పక్షం ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుందో కూడా చూస్తున్నారు అని అంటున్నారు. పదేళ్ళుగా పార్లమెంట్ లో ఏకపక్షంగానే అంతా సాగింది. బిజినెస్ అంతా వన్ సైడెడ్ గా జరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలీ అంటే బుల్డోజ్ చేస్తూ మోడీ ప్రభుత్వం ముందుకు సాగిపోయింది అన్న చర్చ సాగింది.

ఆనాడు విపక్షం ఏమి అడిగినా పెద్దగా పట్టింపు లేదు. కానీ ఇపుడు బలంగా విపక్షం ఉంది. వారు ఏమి అడిగినా కూడా అధికార పక్షం నుంచి కచ్చితంగా బదులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతకు ముందు అయితే ప్రధాని తన ప్రసంగం చేసి వెళ్ళిపోయేవారు ఇపుడు అలా కుదరదు అని సభలోనే ఉండి విపక్షాలు సంధించే ప్రశ్నలకు జవాబులు చెప్పి తీరాలని అంటున్నారు.

ఇక రాహుల్ గాంధీ పూర్తి మెచ్యూరిటీతో చేస్తున్న ప్రసంగాలు అధికార బీజేపీని ఇబ్బందిలోకి నెడుతున్నాయి. మోడీ టీం రాహుల్ గాంధీ దెబ్బకు బెంబేలెత్తిపోతోంది అని అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ హిందూత్వను కించపరుస్తున్నారు అని ఎంతలా ట్విస్ట్ ఇచ్చినా పార్లమెంట్ లో రాహుల్ ప్రసంగం తాలూకా వీడియోలు చూస్తే మాత్రం హిందూత్వ మీద రాహుల్ అలా ఏమీ అనలేదు అని తెలుస్తోంది.

ఇక రాహుల్ స్పీచ్ కి రిప్లై ఇచ్చేందుకు మోడీ చేసిన ప్రసంగంలో సైతం అవే పాత కధలు వినిపించారు అని అంటున్నారు. పాత డైలాగులు వల్లించారు అని విశ్లేషణలు వస్తున్నాయి. అలాగే యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా రాహుల్ ప్రసంగం ఉంటే మోడీ ప్రసంగం పూర్తి రోటీన్ గా ఉండి యూత్ కి ఏ మాత్రం కనెక్ట్ అయ్యేలా లేదు అని విమర్శలు వస్తున్నాయి.

ఈ దేశంలో కాంగ్రెసేతర ప్రధాని మూడవసారి పగ్గాలు పట్టడం ఒక రికార్డు. పదేళ్ళు పూర్తి కాలం అధికారంలో ఉన్న మోడీకి దేశం మీద పూర్తి అవగాహన ఉంది. తమ ప్రభుత్వం గత రెండు పర్యాయాలు ఏమి చేసింది ఏమి చేయలేకపోయింది ఇంకా ఏమి చేయాలన్నది సమగ్రమైన అజెండాను దేశం ముందు ఆవిష్కరించడంలో మోడీ వైఫల్యం చెందారు అని అంటున్నారు.

రానున్న అయిదేళ్ళ పాటు తమ ప్రభుత్వం ఈ దేశానికి ఏమి చేస్తుంది అన్నది మోడీ వివరించి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఆయన చేసిన రాజకీయ ప్రసంగం చూసిన వారు మాత్రం రోటీన్ అంటున్నారు. ఇంతకంటే ఎన్డీయే ప్రభుత్వం నుంచి కొత్తగా ఆశించలేమా అన్న చర్చ వస్తోంది. ఈ దేశం ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి.

అలాగే నిరుద్యోగం పెద్ద భూతంగా ఉంది. ధరల పెరుగుదల ద్రవ్యోల్బనం వంటివి ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థ వృద్ధి అని చెబుతున్నా దాని ప్రయోజనాలు దేశంలో నూటికి ఎనభై శాతం ప్రజలకు దక్కడం లేదు. ఈ నేపధ్యంలో 2024 నుంచి 2029 మధ్యకాలంలో తాము చేసేది ఏమిటి అన్నది మోడీ చెప్పాల్సి ఉంది. అయితే పార్లమెంట్ లో విలువైన సమయం అంతా విపక్షం మీద విమర్శలు చేయడానికే ఉపయోగించారు అని విమర్శలు ఉన్నాయి.

Tags:    

Similar News