ఎండలపై జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించండి.. హైకోర్టు సంచలన తీర్పు

కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న మాటే కానీ.. తెలుగు రాష్ట్రాలు సహా మిగతా ప్రాంతాల్లో ఎండల తీవ్రత మాత్రం అదే విధంగా ఉంది.

Update: 2024-05-31 13:01 GMT

దేశవ్యాప్తంగా ఎండలు మాడ్చేస్తున్నాయి.. మూడు రోజుల కిందట ఢిల్లీలో 53 డిగ్రీల దాక ఉష్ణోగ్రత నమోదైంది. వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. కనీసం ఇంట్లో ఉందామన్న గోడల నుంచి సెగలు రేగుతున్నాయి. ఢిల్లీలో నీటి కోసం జనం అల్లాడుతున్నారు. ఇక దేశమంతటినీ హీట్ వేవ్ కుదిపేస్తోంది. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న మాటే కానీ.. తెలుగు రాష్ట్రాలు సహా మిగతా ప్రాంతాల్లో ఎండల తీవ్రత మాత్రం అదే విధంగా ఉంది.

నాగపూర్ 56 డిగ్రీలు

మొన్న ఢిల్లీలో 52 డిగ్రీలే అత్యధికం అనుకుంటే.. ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్ లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు అగ్నిగోళాన్ని తలపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ..

తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 47డిగ్రీలకు చేరిన సంగతి తెలిసిందే. ఏపీలోని పల్నాడు, తెలంగాణలోని సింగరేణి ప్రాంతాలు ఎండలకు ప్రసిద్ధి. దీనికితగ్గట్లే ఇప్పటికే 47 డిగ్రీలను తాకాయి. గతంలో హైదరాబాద్ లో ఎండ ఉన్నప్పటికీ ఉక్కపోత ఉండేది కాదు. ఈ ఏడాది మాత్రం చెమట, జిడ్డు రెండూ కనిపించాయి.

రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు..

దేశంలోని పలు ప్రాంతాల్లో హీట్ వేవ్ కారణంగా మండుతున్న ఎండలకు 54 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు ఉడికిపోతున్నాయని రాజస్థాన్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో దేశవ్యాప్త ఎమర్జెన్సీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఇప్పుడే కఠిన చర్యలు తీసుకోకుంటే.. భవిష్యత్ తరాలను చూసే అవకాశం ఉండదు’’ అంటూ అవేదన వ్యక్తం చేసింది.

Tags:    

Similar News