ఉత్తరాంధ్ర కు పెద్ద దిక్కు ఆయనేనా ?

తెలుగుదేశం పార్టీలో ఒకనాడు ఎంతోమంది ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.

Update: 2024-10-27 06:30 GMT

తెలుగుదేశం పార్టీలో ఒకనాడు ఎంతోమంది ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. వారంతా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఉన్నారు. పార్టీ అభ్యున్నతికి కూడా కారకులు అయ్యారు. ఇక అందరిలోనూ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుది ప్రత్యేక శైలి.

ఆయన ముద్ర ఉత్తరాంధ్రా రాజకీయాల్లో కీలకంగా మారింది. ఆయన ఉన్నంతవరకూ టీడీపీ అధినాయకత్వం ఆ వైపునకు చూసుకునేది కాదు అని అంటారు. అయితే ఎర్రన్నాయుడు మరణం తరువాత మాత్రం పార్టీ కొంత ఇబ్బందులో పడింది. ఇపుడు ఆ లోటు తీరుతోందా అన్న చర్చ అయితే వస్తోంది.

ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రామ్మోహన్ నాయుడు వరసగా మూడు సార్లు శ్రీకాకుళం నుంచి లోక్ సభకు గెలిచారు. నాలుగు నెలల క్రితం కేంద్రంలో ఏర్పాటు అయిన నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

దాంతో రామ్మోహన్ నాయుడు మీద జాతీయ స్థాయిలో టీడీపీకి వెన్ను దన్నుగా ఉండడంతో పాటు ఉత్తరాంధ్రా బాధ్యతలను కూడా అధినాయకత్వం పెట్టింది. ఉత్తరాంధ్రా అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉంది. ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో అభివృద్ధి వేగవంతంగా జరగాలి.

కేంద్ర మంత్రిగా ఆ నిధులతో తనకు దక్కిన మంత్రిత్వ శాఖలో అభివృద్ధి చేసేందుకు రామ్మోహన్ కృషి చేస్తున్నారు. ఆయన తన వద్ద ఉన్న పౌర విమాన యాన శాఖను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టుని నిర్మిస్తాను అని ఆయన చెబుతున్నారు.

నిజానికి శ్రీకాకుళం బస్టాండ్ చూస్తనే బాధ కలిగే పరిస్థితి ఉంటుంది. జిల్లా కేంద్రంగా ఉన్న శ్రీకాకుళంలో రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉంటాయి. అభివృద్ధికి జిల్లా కేంద్రమే ఆమడ దూరంలో ఉంటే ఇక మిగిలిన ప్రాంతాలను చెప్పనలవి కాదు.

అయితే తాను మాత్రం తన పదవీ కాలంలో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా అభివృద్ధికి కృషి చేస్తాను అని రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు. శ్రీకాకుళానికి ఎయిర్ పోర్టుని మంజూరు చేయడమే కాకుండా తన పదవీ కాలంలోనే పూర్తి చేస్తాను అని అంటున్నారు.

అలాగే మూలపేటలో దాదాపుగా అయిదు వేల కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్న పోర్టు పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఎయిర్ పోర్టు సీ పోర్టు ఈ రెండూ పూర్తి అయితే శ్రీకాకుళం దశ తిరిగినట్లే అని ఆయన అంటున్నారు

ఇక విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఎయిర్ పోర్టు కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి అవుతుందని ఆయన అంటున్నారు. అది కనుక పూర్తి అయితే ఉత్తరాంధ్రా అభివృద్ధి మరో దశకు చేరుకుంటుందని చెబుతున్నారు.

ఉత్తరాంధ్రా అభివృద్ధికి ఎండీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రామ్మోహన్ హామీ ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం హైవేలో ఎలివేటెడ్ వంతెనకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అదే విధంగా నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకూ నాలుగు లైన్ల హైవేని నిర్మిస్తామని కూడా చెప్పారు.

మొదట జిల్లా తరువాత ఉత్తరాంధ్రా రీజియన్ ఆ తరువాత ఏపీ ఇలా మొత్తం సర్వతోముఖాభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేసేందుకు కేంద్ర మంత్రి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్రా టీడీపీకి కంచుకోట. ఇక్కడ బీసీలు టీడీపీని ఆదరిస్తున్నారు. ఆ బీసీల నుంచి వచ్చిన యువనేత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అటు పార్టీని పటిష్టం చేస్తూ ఇటు అభివృద్ధికి తన వంతుగా చేస్తున్న ప్రయత్నాలతో ఉత్తరాంధ్రాలో టీడీపీ మరింత బలోపేతం అవుతోందని అంటున్నారు.

Tags:    

Similar News