అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం.. వైరల్ వీడియో

ప్రతిపక్ష ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ సీఎం రేఖా గుప్తాపై మరోసారి విమర్శలు గుప్పించింది.

Update: 2025-02-26 19:08 GMT

ప్రతిపక్ష ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ సీఎం రేఖా గుప్తాపై మరోసారి విమర్శలు గుప్పించింది. మొన్నటికి మొన్న సీఎం క్యాంప్‌ ఆఫీసులో రేఖా గుప్తా ఏకంగా డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్, భగత్‌ సింగ్ చిత్ర పటాలను తొలగించారని ఆరోపణలు చేసింది ఆప్ పార్టీ.. ఆప్‌ నేత అతిషీ మర్లేనా దీనిపై ట్వీట్ చేశారని వార్తలు వెలువడ్డాయి.

తాజాగా ఇవాళ ఆప్ మరోసారి సీఎం రేఖా గుప్తాను టార్గెట్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రేఖా గుప్తా నిద్రపోతున్నట్లు చూపించే 13 సెకన్ల వీడియోను ఆప్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, "ఇక్కడ నిద్రపోతున్నది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఢిల్లీ ప్రజలు తమకు సేవ చేయాలని అసెంబ్లీకి పంపితే, సమావేశాల్లో సీఎం గారు నిద్రపోతున్నారు" అని విమర్శించింది.

అంతేకాదు "సీఎం గారు అంబేద్కర్, భగత్ సింగ్‌ను అవమానించడంలో కొంత సమయం తీసుకున్నట్లు గానే.. అసెంబ్లీ చర్చలపై కూడా కొంత దృష్టి పెడితే మంచిది" అంటూ ఆప్‌ తన ఆరోపణలను మరింత గట్టిగా చేసింది. ఆప్ షేర్ చేసిన వీడియోలో సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో కళ్లు మూసుకుని ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ ఆరోపణలపై సీఎం రేఖా గుప్తా ఇంకా స్పందించలేదు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం సీఎం గారు శ్రద్ధగా ప్రసంగాన్ని వింటున్నారని.. మార్ఫింగ్ వీడియోను పెట్టి ఆప్ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. దీంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆప్ పార్టీ వరుసగా చేసిన విమర్శలు, వీడియో విడుదల నేపథ్యంలో ప్రభుత్వ పక్షం నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి.

Tags:    

Similar News