మూసీ కబ్జాలో ఇద్దరు మాజీమంత్రులు.. ఆ జాబితాలో ఇంకెంతమంది..?
అంతేకాకుండా తాజాగా.. తాము మూసీకి వ్యతిరేకం కాదని, మూసీ పేరిట జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకమంటూ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం మూసీ నది చుట్టూనే తిరుగుతున్నాయి. మూసీని సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. అందులోభాగంగా ఇప్పటికే మూసీ బాధితులను అక్కడి నుంచే తరలించే పనిని ప్రభుత్వం చేపట్టింది. అయితే.. వారిలో కొంత మంది స్వచ్ఛందంగా వెళ్లిపోగా.. మరికొంత మంది మాత్రం దశాబ్దాలుగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయలేక గొడవలకు దిగారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు.
మరోవైపు.. మూసీ ప్రక్షాళలనను ముందు నుంచి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజలను ఇబ్బందులు పెట్టి పర్యాటక ప్రాంతాలను నిర్మించడం అవసరమా అంటూ నిలదీస్తున్నారు. ఇక.. మూసీ పేరిట పెద్ద ఎత్తున అవినీతికి తీశారని బీఆర్ఎస్ నేతలు ఆరిపిస్తున్నారు. రూ.25వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్టును లక్షన్నర కోట్లతో నిర్మించేందుకు సిద్ధం అయ్యారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున డబ్బులను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధం అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాజాగా.. తాము మూసీకి వ్యతిరేకం కాదని, మూసీ పేరిట జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకమంటూ ప్రకటించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తూ వచ్చారు. అందులోనూ ముఖ్యంగా స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మూసీ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చారు. అందులోభాగంగానే బీఆర్ఎస్ పై సీరియస్ అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావుల మీద అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. గంటన్నర పాటు ప్రెస్ మీట్ లో మాట్లాడిన రేవంత్ పూర్తిగా బీఆర్ఎస్‌ను టార్గె్ట్ చేస్తూ తన స్పీచ్‌ను కొనసాగించారు. అయితే.. ఇప్పటివరకు మాటలతో రిప్లై ఇచ్చిన రేవంత్.. ఇప్పడు బీఆర్ఎస్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు మరింత కొత్తగా ఆలోచన చేశారు.
అందులో భాగంగానే.. మూసీని కబ్జా చేసిన వారి జాబితాను తయారు చేయించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో కలిసి ఎవరెవరు కబ్జాలు చేశారు..? ఏయే కట్టడాలు నిర్మించారు..? అని లెక్కలు తీశారు. అయితే.. ఈ జాబితాలో పలువురు బీర్ఎస్ పార్టీ నేతలు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులోనూ ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మూసీ ప్రాంతంలోని బఫర్ జోన్‌లో అక్రమంగా కట్టడాలు నిర్మించారు. ఫంక్షన్ హాళ్లు, విల్లాలు నిర్మించారు.
బఫర్ జోన్ పరిధిలో తాము నిర్మిస్తున్నామని తెలిసినప్పటికీ.. వాటని పట్టించుకోలేదు. ఈ విషయం అటు జీహెచ్ఎంసీ అధికారులకు సైతం తెలిసినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ నేతలు కాబట్టి వాళ్లు కూడా లైట్ తీసుకున్నారు. దాంతో ఇప్పుడు వారికి చెందిన ఫంక్షన్ హాల్స్, విల్లాలు ఉన్నాయి. దీంతో హైడ్రా త్వరలోనే వాటిని కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చి ఆ పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అధికారులు తయారుచేసిన జాబితాలో ఇంకా కొంత మంది బీఆర్ఎస్ నేతల పేర్లు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు వారందరిలోనూ భయాందోళన మొదలైనట్లు టాక్.