కాంగ్రెస్ కు 12- 14 సీట్లు.. అతివిశ్వాసం అనిపించట్లేదా రేవంత్?
ఆయన చెప్పిన అంశాల్లో ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల లెక్కలను చెప్పుకొచ్చారు.
ఎంత ఎన్నికలైతే మాత్రం నోటికి వచ్చినట్లుగా మాటలు చెప్పేస్తే.. ఓట్లు రాలతాయా? కీలకమైన ఎన్నికలు ముంచుకొచ్చినప్పుడు ఫలితాల అంచనాల మీద ప్రశ్నలు ఎదుర్కోవటం మామూలే. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాలన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ అవుతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులకు దగ్గర పడుతున్న వేళ.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఆయన చెప్పిన అంశాల్లో ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల లెక్కలను చెప్పుకొచ్చారు. పన్నెండు నుంచి పద్నాలుగు సీట్ల వరకు కాంగ్రెస్ గెలుస్తుందన్న విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చే వీలు లేదు. ఇదే విషయాన్ని పలువురు చెబుతున్నారు. దీనికి కారణం.. అభ్యర్థులేనని చెప్పాలి. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారు బలోపేతంగా కనిపిస్తున్నారు. కానీ.. రేవంత్ మాత్రం డజన్ నుంచి పద్నాలుగు స్థానాల్లో విజయం ఖాయమన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇంతకూ సీఎం రేవంత్ కున్న ధీమా ఏమిటి? అన్నది చూస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ కుదేలు కావటం.. వరుసగా ఎదురుదెబ్బలు తగలటం.. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావటం.. పలువురు గులాబీ నేతలు కారు దిగేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎన్నికల్లో ఉండదన్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయి. ఇదే విషయాన్ని రేవంత్ తనదైన శైలిలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి మందుకు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉన్నట్లే.. రాష్ట్రంలో కేసీఆర్ హయాం కూడా ముగిసింది. ఇక ఆయన ఏమి చేసినా ప్రజలు నమ్మరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు? ఏం చేశారు? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అన్నది తెలుసు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి.. అంతా అవినీతిమయం చేశారు’’ అంటూ మండిపడుతున్నారు.
అదే సమయంలో తమ ప్రభుత్వానికి మంచి మార్కులు ఇచ్చేసుకున్నారు. తమ ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చామని.. ఎక్కడ.. ఎలాంటి పొరపాట్లు జరిగినట్లు తెలిసినా వెంటనే చర్యలు తీసుకొని సవరించే ప్రయత్నం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అన్ని వేళల్లోనూ తమ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పని చేస్తుందని.. మంత్రులంతా కూడా నిత్యం సమీక్షలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని చెబుతున్న రేవంత్.. ఈ ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదిస్తారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు కేసీఆర్ వైఫల్యాల్ని ప్రస్తావించిన రేవంత్ మోడీ సర్కారులోని లోపాల్ని ఎత్తి చూపుతూ.. ‘‘మోడీ ప్రభావం మసకబారింది. మాటలు చెప్పి పని చేయకుంటే ఎంత కాలం ప్రజలు నమ్ముతారు? అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. లోక్ సభా ఎన్నికల్లో బీజేపీకి కూడా ఇదే తరహాలో తీర్పు చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. పైకి వేర్వేరుగా ఉన్నా.. లోపల మాత్రం పరస్పరం సహకరించుకుంటున్నాయి అన్నట్లుగా వ్యవహరం నడుస్తోంది’’ అంటూ పేర్కొన్నారు.
మొత్తంగా బీజేపీ.. బీఆర్ఎస్ తీరు బాగోలేదు కాబట్టి .. లోక్ సభా ఎన్నికల్లో తాము ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశం ఉందన్న ధీమా రేవంత్ మాటల్లో వినిపిస్తోంది. అయితే.. ఇన్ని సీట్లను సాధించటం ముఖ్యమంత్రి రేవంత్ అనుకున్నంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో చెప్పే మాటలకు.. అంచనాలకు తర్వాత సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్న ధ్యాసతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఓకే. లేదంటే మాత్రం తిప్పలు పక్కా అని చెప్పక తప్పదు.