ఇరకాటంలో రేవంత్ ప్రభుత్వం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు పెద్ద ఇరకాటంలో పడిందట. ఏ విషయంలో అంటే జరిగిన అవినీతిపై విచారణ ఏ సంస్ధతో చేయించాలనే విషయంలో.

Update: 2024-03-01 04:43 GMT

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు పెద్ద ఇరకాటంలో పడిందట. ఏ విషయంలో అంటే జరిగిన అవినీతిపై విచారణ ఏ సంస్ధతో చేయించాలనే విషయంలో. హెచ్ఎండీఏ పరిధిలోని రెరా డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి తవ్వేకొద్ది బయటపడుతోంది. వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే ప్రభుత్వం నిర్ధారణకొచ్చింది. పైకి బాలకృష్ణ కనబడుతున్నా అవినీతిలో చాలామంది ఐఏఎస్ అధికారులకు భాగస్వామ్యం ఉందని బయటపడుతోంది. ఇప్పటికే అర్వింద్ కుమార్ కూడా అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వానికి ఆధారాలు దొరికాయంటున్నారు.

అందుకనే హెచ్ఎండీఏ అవినీతిపై సీబీఐ లేదా దాంతో సమానంగా ఉండే దర్యాప్తు సంస్ధతో విచారణ చేయిస్తామని రేవంత్ ప్రకటించారు. సీబీఐ సమాన సంస్ధ అంటే ఇంకో సంస్ధలేదని అందరికీ తెలిసిందే. చేయిస్తే సీబీఐతో చేయించాలి లేదా రాష్ట్రస్ధాయిలో సీఐడీ లేదా ఏసీబీతో దర్యాప్తుచేయించాలంతే. సీబీఐతో చేయించాలంటే ఒక చిక్కుందని మంత్రులు అభిప్రాయపడ్డారట. అదేమిటంటే సీబీఐ కేంద్ర దర్యాప్తు సంస్ధ కాబట్టి దర్యాప్తంతా కేంద్రం చెప్పుచేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారట. కేంద్రం చెప్పుచేతుల్లోకి వెళ్ళటం అంటే బీజేపీ నేతలదే పైచేయి అవుతుందన్నది అసలు ఆందోళన.

అందుకనే కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజి అవినీతిపై సీబీఐతో దర్యాప్తుచేయించాలని బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అండ్ కో పదేపదే డిమాండ్లు చేస్తున్న విషయాన్ని మంత్రులు రేవంత్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. సీబీఐ వద్దని సీఐడీతో దర్యాప్తుచేయిస్తే రాష్ట్రప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని కేసీయార్, కేటీయార్, హరీష్ గోల చేయటం ఖాయం. ఇప్పటికే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ రకమైన ఎదురుదాడికి దిగేశారు.

బ్యారేజీలు కట్టడం లేదా రిపేర్టు చేయించటం రేవంత్ ప్రభుత్వానికి చేతకావటంలేదని నానా రచ్చ చేస్తున్న విషయం చూస్తున్నదే. మొత్తానికి సాగునీటి ప్రాజెక్టులు రాజకీయంగా వివాదాస్పదం అయిపోయాయి. నిర్మాణాలు నాసిరకమని ఇప్పటికే తేలిపోయాయి. కాకపోతే అందుకు బాధ్యులెవరు ? జరిగిన అవినీతి ఏ స్ధాయిలో ఉంది ? దానికి ప్రత్యామ్నాయం ఏమిటన్నదే ఇపుడు తేలాల్సుంది. అది తేల్చుకోలేకే రేవంత్ ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. మొత్తానికి దర్యాప్తును ఏ సంస్ధతో దర్యాప్తు చేయించాలనే విషయం అర్ధంకాక రేవంత్ ప్రభుత్వం పెద్ద ఇరకాటంలో పడినట్లు తెలిసిపోతోంది.

Tags:    

Similar News