రేవంత్ పంచ్ అదిరిందిగా..?

కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎన్డీఏ యేతర పాలిత రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నాయి

Update: 2024-07-23 13:53 GMT

కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎన్డీఏ యేతర పాలిత రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నాయి. అలా అని ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు ఏదో ఒరగబెట్టేశారని కాదు అనే కామెంట్లూ తదనుగుణంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఎన్.డీ.ఏ.కు సరికొత్త అబ్రివేషన్ చెబుతూ మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

అవును... కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... బడ్జెట్ లో తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. కేంద్ర తీరుచూస్తుంటే... వికసిత్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం భాగం కాదు అన్నట్లుగా ఉందని ఫైర్ అయ్యారు. ఏపీ, బీహార్ లకు తప్ప ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు లేకపోవడం దారుణం అని ధ్వజమెత్తారు.

ఇదే సమయంలో.. ఓట్లు, సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి కానీ... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం పట్ల కేంద్రానికి ఎటువంటి పట్టింపూ లేదని మరోసారి రుజువైందని రేవంత్ నిప్పులు చెరిగారు. తెలంగాణకు పెద్దన్నగా న్యాయం చేయాలని కోరినా మోడీని కోరినా, కేంద్రమంత్రులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని అన్నారు. అసలు బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్నే ఉచ్చరించలేదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంతా బోగస్ అని మండిపడిన రేవంత్... గుజరాత్ కు ఎలా నిధులు కేటాయిస్తున్నారో.. తెలంగాణకు అలానే ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని తగులుకున్న రేవంత్ రెడ్డి... తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని, మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకొవాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలోనే... కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సరికొత్త అర్ధం చెప్పారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా... ఎన్.డీ.ఏ.లో ‘ఎన్’ అంటే నాయుడు (చంద్రబాబు నాయుడు), నితిష్ (నితిష్ కుమార్) అని.. ‘డి’ అంటే డిపెండెంట్ అని, ‘ఏ’ అంటే అలయన్స్ అని రేవంత్ అన్నారు. దీంతో... పంచ్ అదిరింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ దారుణంపై కిషన్ రెడ్డి స్పందిస్తారా? అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News