బడ్జెట్ తో సౌతిండియాను ఏకం చేస్తున్న రేవంత్ !?

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ మీద నిప్పులు చెరిగారు. మోడీ పెద్దన్న కాదని తేల్చేశారు

Update: 2024-07-23 16:25 GMT

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ మీద నిప్పులు చెరిగారు. మోడీ పెద్దన్న కాదని తేల్చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడం లేదని కూడా ఆరోపించారు. కుర్చీ బచావో బడ్జెట్ లా ఉందని నిందించారు. నాయుడు నితీష్ డిపెండెంట్ అలయెన్స్ గా ఎన్డీయేను ఆయన అభివర్ణించారు.

దక్షిణాది రాష్ట్రాలు ఓట్లు వేసే యంత్రాలుగా కనిపిస్తున్నాయా అని కేంద్రం మీద రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. దక్షిణ భారత దేశం పట్ల వివక్ష కొనసాగుతోందని అన్నారు. తాను దక్షిణాది ముఖ్యమంత్రులతో ఒక సమావేశం పెట్టాలనుకుంటున్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడామని వారు సానుకూలంగా స్పందించారు అని రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణా అసెంబ్లీలో బుధవారం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణా పట్ల చూపించిన వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర హక్కులను కాపాడే విధంగా తీర్మానం ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వచ్చి మద్దతు ఇస్తారో లేదో చూడాలని అన్నారు.

కేంద్ర బడ్జెట్ కక్ష పూరితంగా ఉందని ఈ విషయంలో కేంద్రం మీద పోరాటానికి తమతో కలసివచ్చేది ఎవరో చీకటి ఒప్పందాలు చేసుకునేది ఎవరో బుధవారం నాటి తీర్మానంతో తేలిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఅర్ సభకు వచ్చి తీర్మానానికి మద్దతు ఇస్తే తెలంగాణా ప్రజల కోసం నిలబడుతున్నట్లుగ్గా లేదా కిషన్ రెడ్డితో కలసి ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు అని మాజీ సీఎం కి ఒక సందేశాన్ని ఇచ్చేశారు.

అంతే కాదు తెలంగాణా నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ తెలంగాణా పౌరులుగా ఆలోచించాలని ఆయన కోరారు. పునర్ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణాకు ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన జీవితంలో ఇలాంటి కక్ష పూరితమైన బడ్జెట్ ని ఎపుడూ చూడలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

కేంద్రం నిధులు ఇవ్వకపోతే తమ ప్రణాళికకు తమకు ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా పార్లమెంట్ లో ఇతర పార్టీల ఎంపీలు గళమెత్తాలని ఆయన కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీగా ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్ లో కూడా తన కార్యాచరణ ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇదిలా ఉంటే ఇండియా కూటమి ప్రభుత్వాలకు కేంద్ర బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. అలాగే సౌత్ ఇండియాలో కూడా వివక్ష బాగా కనిపిస్తోంది. దాంతో దక్షిణాది ముఖ్యమంత్రులందరినీ కూడగట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి కేంద్ర బడ్జెట్ కి ఒక ముఖ్యమంత్రి ఈ లెవెల్ లో గట్టిగా సౌండ్ చేసి కేంద్రాన్ని గద్దించడం అన్నది గతంలో ఎపుడూ లేదు. రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రంతో తేల్చుకోవాలనే అనుకుంటున్నారు. ఇక ఇండియా కూటమి కూడా కేంద్ర బడ్జెట్ మీద నిప్పులు చెరుగుతున్న నేపధ్యంలో దక్షిణాది రాష్ట్రాలు ఏక త్రాటి మీదకు వస్తాయా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News