రామోజీరావు మృతి పట్ల రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలో... మీడియా మొఘల్ రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడి అనే గ్రామంలో జన్మించి.. 'ఈనాడు' దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించి.. ఈనాడుతో పాటు 'సితార' సినీపత్రికను నడిపి.. ఎన్నో సినిమాలను నిర్మించి.. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించి.. 2016లో పద్మవిభూషణ్ సత్మారాన్ని పొందిన రామోజీరావు మృతిచెందారు.
ఈ నేపథ్యంలో... మీడియా మొఘల్ రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇందులో భాగంగా... నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, కేసీఆర్, కిషన్ రెడ్డి, బాలకృష్ణ లతోపాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, రాజేంద్రప్రసాద్, రాజమౌళి మొదలైన ప్రముఖులు నివాళులర్పించారు.
ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు చీఫ్ సెక్రటరీ ద్వారా ఆదేశించారు.
ఈ సందర్భంగా స్పందించిన రేవంత్ రెడ్డి... తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని అన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రేవంత్ తెలిపారు.