రేవంత్ మరీ ఇంత డేంజర్ గా ఉన్నాడేంది బాస్?

రాష్ట్రాన్ని వదిలేసిన రేవంత్ అన్నేసి రోజులు ఢిల్లీలో ఎందుకు ఉంటున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది.

Update: 2024-06-29 14:30 GMT

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో ఉండటం.. అక్కడి నుంచే పాలనను సాగించటం చేసినోళ్లకు ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. రాష్ట్రాన్ని వదిలేసిన రేవంత్ అన్నేసి రోజులు ఢిల్లీలో ఎందుకు ఉంటున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. చివరకు అర్థమైన సీన్ ఏమంటే.. రేవంత్ బయటకు రాకుండా.. కామ్ గా ఉన్నా.. ఎలాంటి యాక్టివిటీలు పెట్టుకోకుండా గమ్మున ఉంటే.. గులాబీ బ్యాచ్ కు కొత్త గండం ఏదో ముంచుకొస్తుందన్న విషయం మరోసారి నిరూపితమైంది.

మొన్నటికి మొన్న ఐదారు రోజుల పాటు మౌనంగా ఉన్న తర్వాత గులాబీ పార్టీలో పెద్ద మనిషిగా.. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా.. పెద్ద మనిషిగా చెలామణీ అయ్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకున్న వైనం చూసినోళ్లకు చాలా విషయాలు అర్థమయ్యే పరిస్థితి. తన పని తాను చేసుకోకుండా.. ఏమీ పని లేనట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ కనిపించారంటే చాలు.. రాజకీయ ప్రత్యర్థులకు ఏదో మూడినట్లే.

తాజాగా ఢిల్లీలో ఉన్న ఆయన.. ఐదారు రోజులుగా కేంద్ర మంత్రుల్ని.. పార్టీ అధినాయకత్వంతో క్లోజ్ గా ఉంటున్నారు. భేటీల మీద భేటీల్లో బిజీగా ఉంటున్నారు. అంటే.. ఆయన ఏదో ప్లాన్ చేసి.. దాని ఎగ్జిక్యూషన్ లో ఉన్నట్లుగా ఇప్పుడు చెబుతున్నారు.దీనికి తగ్గట్లే ఢిల్లీలోని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుకునే వేళలో.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నేతగా బరిలోకి దిగాలని ప్రోత్సహించింది రేవంతే. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్టిలో చెప్పుకొచ్చారు.

విపక్ష నేత బాధ్యతను తీసుకోవటానికి రాహుల్ సుముఖంగా లేనప్పుడు.. తానే ప్రతిపాదించానని.. తన ఒత్తిడి మేరకు ఆయన తన ప్రతిపాదనను ఒప్పుకున్న విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ తానున్న ప్రతి రోజును రాష్ట్ర పనుల మీదనే ఫోకస్ చేసిన వైనం కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ తరఫున దూకుడుగా వ్యవహరించిన ఆయన.. తాజా పర్యటనలో మళ్లీ.. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించటం.. ఎన్నికల వేళ తాను చేసిన వ్యాఖ్యల డ్యామేజ్ కు ప్యాచప్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.

రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల ముందుకు తీసుకెళ్లటం.. వాటికి సంబంధించిన హామీలను పొందే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన అంశాలపైనా ఎక్కువ ఫోకస్ పెట్టారు. విపక్ష బీఆర్ఎస్ ను నిట్టనిలువుగా చీల్చే విషయానికి సంబంధించి అధినాయకత్వాన్ని ఒప్పించటంతో పాటు.. పార్టీలోకి వచ్చే నేతలకు ఇవ్వాల్సిన పదవులు.. వాటికి సంబంధించిన అంశాలపైనా క్లారిటీ తెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. ఏం చేసినా.. పార్టీ అధినాయకత్వానికి చెప్పి చేసే విధానాల్ని అనుసరిస్తూ.. ఢిల్లీ స్థాయిలో తన పరపతిని పెంచుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు రేవంత్. ఇదంతా చూసిన ఆయన రాజకీయ ప్రత్యర్థుల నోటి నుంచి మాత్రం.. ‘రేవంత్ మహా డేంజర్ గా ఉన్నాడు బాస్’ అన్న మాట వచ్చేలా చేస్తున్నారు. రేవంతా.. మజాకానా.

Tags:    

Similar News