ఇంగ్లిష్‌ ఛానల్‌ ను దాటుతున్న బ్యాచ్ పై సునాక్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆ గణాంకాలు బ్రిటన్ లో అక్రమ వలసల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గినట్లు చెబుతున్నాయి

Update: 2024-01-02 11:18 GMT

బ్రిటన్ సర్కార్ సరిహద్దులను నియంత్రించడం, ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను రక్షించుకోవడం వంటి చర్యల బలంగా చేపడుతుంది! ఇందులో భాగంగా... అక్రమ వలసలపై బ్రిటన్‌ కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారి సంఖ్యను నియంత్రించడంలో తమ ప్రభుత్వం పురోగతి సాధించిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... అభివృద్ధి చెందిన దేశాలకు అక్రమ వలసలు పెను సమస్యగా మారుతున్నాయనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్పందించిన రిషి సునాక్... అక్రమంగా దేశంలోకి ప్రవేశించే కేసుల్లో తగ్గుదల నమోదైందని తెలిపారు. ఈ మేరకు హోం శాఖ విడుదల చేసిన గణాంకాలను ఆయన ప్రస్థావించారు.

ఆ గణాంకాలు బ్రిటన్ లో అక్రమ వలసల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గినట్లు చెబుతున్నాయి. ఇందులో భాగంగా... చిన్న పడవల్లో ఇంగ్లిష్‌ ఛానల్‌ ను దాటుతున్న వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 36 శాతం తగ్గినట్లు ఆ గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఈ విషయాలపై సునాక్ స్పందించారు. బ్రిటన్‌ ప్రజలపై అక్రమ వలసల భారానికి ముగింపు పలకాలని తాను నిశ్చయించుకున్నట్లు తెలిపారు.

వాస్తవానికి బ్రిటన్‌ లో ఆశ్రయం కోసం అప్లై చేసి పెండింగ్‌ లో ఉన్న కేసులు ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారాన్ని చూపుతున్నాయి. ఈ సమయంలో... బ్రిటన్ లో ఆశ్రయం కోరుకుంటున్న వారు హోటళ్లు, నిర్బంధ కేంద్రాల్లో ఉండటంతో వారి నిర్వహణ నిమిత్తం ప్రభుత్వంపై రోజుకు 10.2 మిలియన్ల డాలర్ల భారం పడుతోంది. దీంతో... వీలైనంత వేగంగా ఈ కేసుల్ని పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదిలా ఉండగా... బ్రిటిష్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే అంతర్జాతీయ విద్యార్థులకు వీసా కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా... ఇక నుంచి విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదు. సరిహద్దులను నియంత్రించడం, ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థను రక్షించుకునే చర్యల్లో భాగంగా... ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఫలితంగా... వేల సంఖ్యలో వలసలు తగ్గుతాయని బ్రిటన్ భావిస్తుంది.

కాగా... బ్రిటన్‌ కు వస్తోన్న విదేశీ విద్యార్థులు వారితోపాటు వారి వారి కుటుంబీకులను తీసుకురావడం ఇటీవల భారీగా పెరిగిందని ఘణాంకాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2019 సెప్టెంబర్‌ లో 14,839 వీసాలు జారీ చేయగా.. సెప్టెంబర్‌ 2023 నాటికి ఈ సంఖ్య 1.52 లక్షలకు పెరిగినట్లు బ్రిటన్‌ జాతీయ గణాంకాలు వెల్లడించాయి. దీంతో... బ్రిటన్ వీసాల విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News